మెక్సికోలో డ్రాగ్ మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి. సెంట్రల్ మెక్సికో గునజుటో స్టేట్‌లోని ఓ బార్‌లో కాల్పుల ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా ఇద్దరికి గాయాలయ్యాయి. అపసియోల్ అల్టో పట్టణంలోని బార్‌లోకి బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చొచ్చుకువచ్చిన సాయుధ దుండగులు లోపలున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారని అధికారులు వెల్లడించారు. కాల్పుల్లో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు మరణించారు. మరో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. గాయపడిన మహిళల పరిస్ధితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు పేర్కొన్నారు. కాల్పులు జరిపిన దుండగులను ఇంకా గుర్తించలేదని, ఓ నేరస్తుల గ్రూపునకు సంబంధించిన రెండు పోస్టర్లు ఘటనా స్ధలంలో విడిచివెళ్లారని చెప్పారు.
పారిశ్రామిక హబ్‌గా పేరొందిన గునజుటోలో తరచూ గ్యాంగ్ వార్స్ జరుగుతుంటాయి. గత నెలలో ఇరుపుటో సిటీలోని బార్‌లో జరిగిన కాల్పుల్లో 12 మంది మరణించగా సెప్టెంబర్‌లో అదే ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. డ్రగ్స్..నేరాలు మెక్సికో ప్రజలను వేధిస్తున్నాయి. నేర ప్రవృతితో మెక్సికో యువత డ్రగ్స్ కు బానిసగా మారారు. దీంతో ఆ దేశంలో విచ్చలవిడి దాడులు…నేరాలు నిత్య కృత్యం అయ్యాయి.
Also Read : మెక్సికోలో తూటాల వర్షం.. 20 మంది మృతి