ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి కలిగిన నాయకుడని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నేడు ప్రధాని పాల్గొన్న సభలో సిఎం జగన్ ప్రసంగించిన తీరు రాష్ట్రం పట్ల ఆయనకున్న బాధ్యతను తెలియజేసిందన్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని ఈ సభ ఎంతో పెంచిందని ప్రసంశించారు. సిఎం ఎంతో హుందాగా రాష్ట్ర సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళారన్నారు. విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీకార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. జగన్ అందరిలాగా మాయమాటలు చెప్పీ నాయకుడు కాదని నేటితో తేటతెల్లమైందని స్పష్టం చేశారు. కానీ విపక్షాలు రాష్ట్రంపై దుష్ప్రచారం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అందుకే ఎప్పటికీ వారు అక్కడే ఉంటారు, మేము అధికారంలోనే ఉంటామని బొత్స వ్యాఖ్యానించారు.
రిషికొండపై నేడు ఓ దినపత్రికలో వచ్చిన వార్తను బొత్స తీవ్రంగా ఖండించారు. కొండకావరం అంటూ ఆ రాసిన ఆ పత్రికకు ఎంత కండకావరం అంటూ ప్రశ్నించారు. ‘రుషికొండలో ఇంతకు ముందు టూరిస్ట్ గెస్ట్‌హౌస్ ఉండేది. మళ్లీ టూరిజం అక్కడ భవనాలు నిర్మిస్తుంది. తప్పెంటి? నిర్మాణాలు చేయకూడదా?’ అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ విజయనగరం పర్యటనపై కూడా బొత్స స్పందించారు. ‘రేపు ఉదయం మా విజయనగరంకు జనసేన నాయకుడు పవన్ వెళ్తారట. జగనన్న కాలనీలు చూసేందుకు వెళ్తారట. వెళ్లండి తప్పులేదు. విజయనగరం జిల్లా చరిత్రలోనే ఇంత పెద్ద లే అవుట్ ఎక్కడా లేదు. సుమారు 400 ఎకరాల్లో 12 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అందులో 10 వేల మందికి పక్కా ఇళ్లు ఇచ్చాం. అది ఒక టౌన్‌షిప్.అక్కడ ఊరు నిర్మిస్తున్నాం. అది పూర్తి కావడానికి నాలుగేళ్లు అవుతుంది’ అని చెప్పారు. అక్కడ ఏదో అన్యాక్రాంతం అవుతున్నట్లు, ఏదో జరుగుతున్నట్లు రాద్దాంతం చేయడం సరికాదన్నారు. నువ్వు జతకట్టిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆలోచన ఎందుకు రాలేదని అడిగారా అని పవన్ ను నిలదీశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.