Sunday, January 19, 2025
HomeTrending Newsఅమెరికా అధ్యక్ష బరిలోకి మళ్ళీ ట్రంప్

అమెరికా అధ్యక్ష బరిలోకి మళ్ళీ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇంకా వైట్ హౌస్ మీద ప్రేమ తగ్గలేదు. 2016లో యూఎస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత తన అనాలోచిత, దూకుడైన నిర్ణయాలతో అమెరికన్లనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఒక ఆటాడుకున్నారు. చివరకు 2020లో ఓడిపోయే సమయంలో ఏకంగా క్యాపిటల్ భవనంపై తన అనుచరులతో విధ్వంసం సృష్టించాడు. ఓవల్ ఆఫీస్‌ను వీడిపోయే సమయంలో కీలకమైన డాక్యుమెంట్లను కూడా పట్టుకొని పోయినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఓడిపోయాడు కదా.. ఇక ట్రంప్ గోల తప్పిందిలే అని అమెరికన్లు భావిస్తున్న వేళ.. ఆశ్చర్యకరమైన ప్రకటన వెలువడింది. 2024 యూఎస్ అధ్యక్ష ఎన్నికల బరిలో తాను ఉండబోతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మరో సారి బరిలోకి దిగుతానని ఆయన మంగళవారం (భారత కాలమానం ప్రకారం బుధవారం) ప్రకటించారు. అమెరికా పునరాగమనం ఇప్పుడు ప్రారంభమవుతుందని ట్రంప్ తన అనుచరులతో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ట్రంప్‌కు మరోసారి అధ్యక్షుడు అయ్యే అర్హత ఉన్నది.

ఇటీవల ఫ్లోరిడాలో పర్యటించిన ట్రంప్.. నవంబర్ 15న కీలక ప్రకటన చేస్తానని చెప్పారు. ఇప్పటికే ట్రంప్‌కు చెందిన రాజకీయ సంస్థ కోసం పని చేసిన బ్రాడీ క్రేట్.. యూఎస్ ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద కీలక పత్రాలను దాఖలు చేశారు. అందులో 2024 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌లో డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తారని పేర్కొన్నారు. అయితే, రిపబ్లికన్ పార్టీ నుంచి ఇప్పటికే ఇద్దరు అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ (44), మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ (63) ఈ సారి రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో ఉండాలని భావిస్తున్నారు. ఇప్పుడు వారికి పోటీగా ట్రంప్ కూడా బరిలోకి దిగారు. ట్రంప్ హయాం నుంచి రిపబ్లికన్ పార్టీపై అమెరికన్లలో వ్యతిరేకత నెలకొన్నది. ఆయన దిగిపోయిన తర్వాత కూడా ఆ పార్టీపై కోపం చల్లారలేదు. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఇప్పటికే దీనిపై సమీక్ష జరిపిన పార్టీ.. ట్రంప్ విధేయుల కారణంగానే నిరుత్సాహకరమైన ఫలితాలు వచ్చినట్లు తేల్చింది. ఇక చట్ట పరమైన వివాదాలు, విభజన రాజకీయ ఆరోపణలు ఎదుర్కుంటున్న ట్రంప్‌కు పార్టీని నడపే అర్హత లేదనే విమర్శలు పెరిగాయి. మరి ట్రంప్‌కు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనడానికి రిపబ్లికన్ పార్టీ సభ్యుల మద్దతు ఉంటుందో లేదో తెలియాలి. మరోవైపు అమెరికాలోని ఒక వర్గం వారిలో ట్రంప్‌కు ఆదరణ ఇంకా తగ్గలేదని తెలుస్తున్నది. రిపబ్లికన్ పార్టీకి 100 మిలియన్ డాలర్లకు పైగా నిధులను ట్రంప్ సేకరించి పెట్టారు. మధ్యంతర ఎన్నికల్లో కూడా ట్రంప్ ఉత్సాహంగా ప్రచారం చేశారు. కీలక నేతలు మొఖం చాటేస్తున్న సమయంలో రిపబ్లికన్ పార్టీని ట్రంప్ ఆదుకుంటున్నారు. దీంతో ఆయనపై కొంత సానుభూతి కూడా వ్యక్తం అవుతోంది.
 

RELATED ARTICLES

Most Popular

న్యూస్