శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం కుమ్రం భీం- ఆసిఫాబాద్ జిల్లాలో రూ.12.30 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన 7 నూతన పోలీస్‌స్టేషన్ లను మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. మంత్రుల వెంట ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, డీజీపీ మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ సురేష్ కుమార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిదులు ఉన్నారు.
కాగజ్ నగర్ పర్యటనలో భాగంగా కోటి రూపాయాల వ్యయంతో నిర్మించిన కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్, రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించిన సర్కిల్ ఇన్స్పెకర్ట్ కార్యాలయ భవనాలను ప్రారంభించారు. కాగజ్ నగర్ రూరల్ పోలీస్ట్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాంకిడి పోలీస్ స్టేషన్ (రూ. 2. 50 కోట్లు), కౌటాల పోలీస్ స్టేషన్ (రూ. 2. 50 కోట్లు), పెంచికల్ పేట్ పోలీస్ స్టేషన్ (రూ. 2. 50 కోట్లు), చింతలవానిపల్లి పోలీస్ స్టేషన్ (రూ. 2. 50 కోట్లు) ల శిలఫకాలను ఆవిష్కరించి, వర్చువల్ ద్వారా నూతన పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించారు. అంతకుముందు హరితహారం కార్యక్రమంలో భాగంగా రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మంత్రులు మొక్కలు నాటారు.
అనంతరం కోటి రూపాయాల వ్యయంతో నిర్మించిన రెబ్బన పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని మంత్రులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు రూరల్ పోలీస్ స్టేషన్‌లోని అన్ని గదుల్లో కలియతిరిగారు. పోలీస్‌స్టేషన్‌లో నిర్మించిన ఎస్‌హెచ్‌వొ గదిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మహిళ ఎస్‌ఐని కుర్చీలో కూర్చోబెట్టి వేదపండితులు ఆశీర్వచనం చేసి అభినందించారు. స్టేషన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ కమ్ వెయిటింగ్ హాల్, యాంటె రూమ్‌తో ఎస్‌హెచ్‌వొ రూమ్, రైటర్ రూమ్, ఇంటర్వ్యూ గది, కమ్యూనికేషన్ రూమ్, సిసి కెమెరాలను మంత్రులు, డిజిపి పరిశీలించారు.
అనంతరం మంత్రులు మాట్లాడుతూ…. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధితో పాటు పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి ఖర్చుకు వెనకాడకుండా నూతన భవనాలకు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దిశనిర్ధేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందని పేర్కొన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరచడంలో వేలాది పోలీస్ పోస్టులను భర్తీ చేశారని వివరించారు.