వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ అందుబాటులోకి వస్తాడని, జట్టుతో చేరతాడని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు డైరెక్టర్ ఆపరేషన్స్ మైక్ హేస్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవలే ముగిసిన వరల్డ్ కప్ టి20 వరల్డ్ కప్ లో ఆడిన మాక్స్ వెల్ గత శనివారం జరిగిన ఓ బర్త్ డే పార్టీ తరువాత ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అతడి కాలు విరిగి సుదీర్ఘ కాలం ఆటకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. దీనితో మాక్స్ వెల్ ఐపీఎల్ -2023నాటికి జట్టుతో ఉంటాడా లేదా అనేది చర్చనీయాంశమైంది.
నిన్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు తాము వదులుకొంటున్న, కొనసాగిస్తున్న ఆటగాళ్ళ జాబితాను వెల్లడించారు. దీనిలో మాక్స్ వెల్ ను బెంగుళూరు కొనసాగిస్తున్నట్లుగా ప్రకటించింది. దీనిపై ఆర్సీబీ వివరణ ఇస్తూ ‘ అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. ఐపీఎల్ నాటికీ అతడు మాతో ఉంటాడని సమాచారం ఉంది’ అంటూ ప్రకటన ఇచ్చింది.
2022 ఐపీఎల్ లో మాక్స్ వెల్ అంతగా రాణించలేకపోయాడు. 18మ్యాచ్ లు ఆడి కేవలం 19.68 యావరేజ్ తో 315 పరుగులు మాత్రమే చేశాడు, దీనిలో ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే ఉంది.
ఇటీవలి టి 20 వరల్డ్ కప్ లో 39.33 యావరేజ్…161.64 స్ట్రైక్ రేట్ తో 118 పరుగులు చేశాడు. మూడు వికెట్లు కూడా సాధించాడు. అయితే ఆసీస్ సూపర్ 12 నుంచే వైదొలిగింది.
గత ఐపీఎల్ సీజన్లలో అత్యుత్తమ ఆట తీరుతో ఆకట్టుకున్న మాక్స్ వెల్ ఈసారి తప్పకుండా రాణిస్తాడని ఆర్సీబీ విశ్వసిస్తోంది.