అంగన్ వాడీల్లో నాడు–నేడు పనులు పూర్తిచేయడంతో పాటు భవిష్యత్తులో వాటి నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలని, మన పిల్లలే అక్కడకి వెళ్తారనుకుంటే ఎలాంటి వాతావరణం ఉండాలని కోరుకుంటామో అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్లపై సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీల్లో ఫ్లేవర్డ్ మిల్క్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో నాడు-నేడుపై కూడా సిఎం అడిగి తీసుకున్నారు. మొత్తం మూడు దశల్లో ఈ కార్యక్రమం పూర్తికావాలని, ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలని, హాస్టళ్లలో వెళ్లేసరికి జైల్లోకి వెళ్లిన భావం పిల్లలకు ఉండకూడదని సిఎం స్పష్టం చేశారు. చదువులు కొనలేని కుటుంబాలు తమ పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారని, వారు బాగా చదువుకోవడానికి, ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలని సిఎం ఆకాంక్షించారు. సమాజంలో అట్టడుగున ఉన్నవారు తాము చదువుకోవడానికి తగిన పరిస్థితులు లేవన్న భావన ఉండకూడదని అభిప్రాయపడ్డారు. హాస్టళ్లలో ఉంచాల్సిన బంకర్ బెడ్స్… తదితర సౌకర్యాలన్నీ కూడా నాణ్యతతో ఉండాలన్నారు. గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3013 చోట్ల నాడు–నేడు పనులు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
మొదటి ఫేజ్‌లో మొత్తం సుమారు 1366 చోట్ల మొదలవుతాయని అధికారులు చెప్పగా, దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ కూడా మొదట విడతలోనే బాగుచేయాలని సీఎం ఆదేశించారు. తొలి విడతకు దాదాపుగా రూ.1500 కోట్లు, మొత్తంగా సుమారు రూ.3364కోట్ల దీనికి ఖర్చవుతుందని అంచనా వేశారు. తొలివిడత పనులు వచ్చే జనవరిలో ప్రారంభించి ఏడాదిలోగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషా శ్రీచరణ్, సీఎస్ సమీర్ శర్మ, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీ డీడీసీఎఫ్ ఎండీ ఏ బాబు, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ సిరి, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం జాహ్నవి, మైనార్టీ వెల్ఫేర్ డైరెక్టర్ జి సి కిషోర్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: సూపర్ స్టార్ కు సిఎం జగన్ నివాళి