2024 Elections: చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందే హాండ్సప్ అన్నారని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యానించారు. తనది 40 ఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు మాట్లాడాల్సిన మాటేనా అని ఆమె ప్రశ్నించారు. మీరు గెలిపిస్తేనే కొనసాగుతా లేకపోతే లేదు అని చెప్పారంటే ముందే ఓటమిని ఒప్పుకున్నట్లు అయ్యిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఉషశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ‘బై బై బాబు’ అన్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో ‘గుడ్ బై బాబు’ అని చెప్పబోతున్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఓ అజెండా అంటూ ఏదీ లేదని, రాజకీయంగా దుమారం సృష్టించడానికే వారు ప్రయత్నాలు చేస్తున్నారని ఉషశ్రీ విమర్శించారు. మహిళలు రాజకీయంగా కూడా ఎదిగితేనే సాధికారత సాధ్యమని సిఎం జగన్ బలంగా విశ్వసిస్తారని అందుకే రాజకీయ పదవుల్లో 50 శాతం వారికే కేటాయించారని చెప్పారు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అనే నినాదాన్ని చిత్తశుద్ధితో పాటిస్తున్నారని సోదాహరణంగా వివరించారు.
దేశంలో 1982 నుంచే మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, టిడిపి ఆవిర్భావిన్చినింది 1983లో అని అలాంటిది తామే మహిళా సంఘాలు తెచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి బాబు మోసం చేశారని ఉషశ్రీ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు దాదాపు 25 కోట్లకు పైగా రుణాలను నాలుగు విడతల్లో సిఎం జగన్ చెల్లిస్తున్నారని, ఇప్పటికే 12, 750 కోట్లు చెల్లించారని వెల్లడించారు. 7.97 లక్షల గ్రూపులకు చెందిన 76 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు దీని ద్వారా లబ్ధి చేకూరుతోందన్నారు.