పతనంతిట్ట వద్ద ఏపీకి చెందిన శబరిమల భక్తుల బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. వెంటనే అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. శబరిమల యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో యాత్రికుల బస్సు పతనంతిట్ట వద్ద ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన భక్తుల బృందం మొత్తం 2 బస్సుల్లో 84 మంది శబరిమల వెళ్లారని, ఈ బస్సులు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఉదయం 8:10 గంటలకు పతనంమిట్ట వద్ద ఒక బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సులో 44 మంది ప్రయాణిస్తున్నారని, 18 మంది గాయపడ్డారని, కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో నలుగురికి చికిత్స అందిస్తున్నామని, ఇందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని వివరాలు అందజేశారు. మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నారని, వారికి వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పతనంతిట్ట జిల్లా కలెక్టర్‌తో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Also Read:సూపర్ స్టార్ కు సిఎం జగన్ నివాళి