హైదరాబాద్ లో మరో కొత్త ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. గచ్చిబౌలిలోని శిల్ప లే అవుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఈ రోజు మంత్రి కేటిఆర్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి ఓఆర్‌ఆర్ వరకు నాలుగు లేన్లలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు పూర్తిచేసింది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి, మైండ్‌స్పేస్ జంక్షన్, హైటెక్ సిటీలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది.
గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం కలుగుతుందని అంటున్నారు. ఓఆర్‌ఆర్ (ORR) వరకు రెండు వైపులా కలుపుకుని మొత్తం 956 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పుతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. అప్ ర్యాంపు ఓఆర్‌ఆర్ (Outer Ring Road) నుంచి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వరకు 456.64 మీటర్లు.. శిల్పా లేఅవుట్ నుంచి ఓఆర్‌ఆర్ వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 399.952 మీటర్లు ఉంది. గచ్చిబౌలి నుంచి మైండ్ స్పేస్ వరకు 473 మీటర్ల పొడవు, 8.50 మీటర్ల వెడల్పుతో అప్ ర్యాంపు ఫ్లై ఓవర్‌ను చేపట్టారు. మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలి వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 522 మీటర్ల పొడవు, 8.50 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. శిల్పా లేఅవుట్ (Shilpa Layout) ఫ్లై ఓవర్ వల్ల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్‌సిటి మధ్య రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది.