వెండితెరపై ఎంతోమంది అందమైన కథానాయికలు ఒక వెలుగు వెలిగారు. అందమైన కళ్లతో .. చక్కని పలు వరుసతో .. ఆకర్షణీయమైన నవ్వుతో తెరపై తమదైన ముద్రను వేసిన కథానాయికలలో స్నేహ ముందువరుసలో నిలుస్తుంది. ఆ తరువాత అందమైన కథానాయికలు చాలామందే వస్తున్నప్పటికీ, ఆకర్షణీయమైన కళ్లతో ఆకట్టుకుంటున్న కథానాయికగా ‘ఆనంది‘ కనిపిస్తుంది. ‘ఈ రోజుల్లో’ సినిమాతో తెలుగు తెరపై చామంతిలా విరిసిన ఈ బ్యూటీ, ‘బస్ స్టాప్’ సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది.
మారుతి సినిమాలు యూత్ లో ఆనందికి మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ, ఆ తరువాత ఆమె తెలుగులో వరుస సినిమాలు చేయలేకపోయింది. అందుకు కారణం ఆమె అందంలోని ప్రత్యేకతను కోలీవుడ్ మేకర్స్ ముందుగా గుర్తించడమే. అక్కడి కుర్రకారులో ఆమె అభిమానుల సంఖ్య పెరిగిపోవడమే. తమిళంలో ఆమె జీవీ ప్రకాశ్ కుమార్ .. అథర్వ .. దినేశ్ .. కృష్ణ .. చంద్రన్ వంటి యంగ్ హీరోల జోడీగా వరుస అవకాశాలను దక్కించుకుంటూ వెళ్లింది.
ఏడేళ్ల తరువాత ‘జాంబిరెడ్డి’ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన ఆనంది, ఆ వెంటనే ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలోను నటించింది. ఈ రెండు సినిమాలు కూడా గ్లామర్ పరంగా .. నటన పరంగా ఆమెకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. అందువల్లనే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాలో ఛాన్స్ దక్కింది. అల్లరి నరేశ్ సరసన ఆమె చేసిన ఈ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా కూడా హిట్ అయితే, ఈ అందాల చందమామ టాలీవుడ్ లో మరికొంతమంది స్టార్ హీరోలతో జట్టుకట్టే అవకాశం ఉంటుంది.