బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యుల్ ను పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈనెల 28 నుండి 5వ విడత పాదయాత్ర షురూ అవుతుంది. బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి బైంసా నుండి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. కరీంనగర్ లో ముగింపు సభ ఉంటుంది. డిసెంబర్ 15 లేదా 16 వరకు కొనసాగనున్న 5వ విడత పాదయాత్ర.
5వ విడత పాదయాత్ర వివరాలను ప్రకటించిన ప్రజా సంగ్రామ యాత్ర సహ ప్రముఖ్ టి.వీరేందర్ గౌడ్ కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇప్పటి వరకు 4 విడతలు పాదయాత్ర చేసినట్టు చెప్పారు. 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు మొత్తం 21 జిల్లాల్లో 1178 కి.మీల మేర నడిచినట్లు వెల్లడించారు. పాదయాత్రతో అనేక మార్పులు సంభవించాయని, తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేననే సంకేతాలు వెలువడ్డాయని వీరేందర్ గౌడ్ పేర్కొన్నారు.