ప్రజలను అనేకసార్లు మోసం చేసి, మాట తప్పి, వెన్నుపోటు పొడిచిన నాయకులను మరోసారి అసెంబ్లీకి పంపాలా…. వద్దా … లేక… మీ సేవలు మాకొద్దు బాబూ అంటూ బై బై చెప్పి ఇంటికి పంపాలా అన్నది ఆలోచించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు. గెలిపించిన ప్రజలకు ఇచ్చిన మాటలను నాయకులు నిలబెట్టుకోవాలని అప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందన్నారు. కూతురినిచ్చిన మామను, ఆ మామ పెట్టిన పార్టీని, ట్రస్టును, చివరకు ఆ మామకు ప్రజలిచ్చిన సిఎం పదవిని కూడా వెన్నుపోటు పొడిచి కబ్జా చేస్తే వాళ్ళను చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు. మోసం చేసే వారికి, వెన్నుపోటు పొడిచే వారికి మరో ఛాన్స్ ఇస్తారా, ఇవ్వ వచ్చా అనేది అలోచించాలన్నారు. రాజకీయం అంటే జవాబుదారీతనం అని పేర్కొన్నారు.
రావణుడిని సమర్ధించిన వారిని రాక్షసులని, దుర్యోదనుడికి కొమ్ముకాసిన వారిని దుష్ట చతుష్టయం అంటున్నామని, అలాంటిది మామ కుర్చీ కబ్జా చేసి, పార్టీని దందా చేసి, ఎన్నికలప్పుడు ప్రజలకు మాయమాటలు చెప్పి, ఆ తరువాత ప్రజలను గాలికి వదిలేసి, మోసం చేసే చంద్రబాబును, ఆయన్ను సమర్ధిస్తున్న వారిని ఏమనాలని ప్రశ్నించారు. దుష్ట చతుష్టయం అనాలా, వద్దా వీరిని రాక్ష మూకలు అనాలా అన్నది ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్షా పథకం రెండో విడతను సిఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో మరోసారి టిడిపి, పవన్ కళ్యాణ్ లపై మండిపడ్డారు.
“తన ఆస్తిని తాను అనుభవిస్తుంటే వారిని హక్కుదారులంటారు, పరాయి వారి ఆస్తిని ఆక్రమిస్తే కబ్జాదారులంటారు. తన భార్యతో సంసారం చేస్తే, ఆమె కోసం యుద్ధం చేస్తే శ్రీరాముడంతారు. పరాయి స్త్రీ మీద ఎవరైనా కన్నువేసి ఎత్తుకుపోతే అలాంటి వాళ్ళను రావణుడంటారు. తనకు తాను పార్టీ పెట్టుకొని అధికారంలోకి వస్తే వారిని ఒక ఎంజీఆర్ అనో, ఒక ఎన్టీఆర్ అనో, ఒక జగనో అంటారు” అంటూ వ్యాఖ్యానించారు.
Also Read : Kharma-Counter: అధికార భగ్న ప్రేమికుడు బాబు: జగన్