బాలకృష్ణ గౌరవ అధ్యక్షతన, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో సంవత్సర కాలం పాటు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ శత జయంతి మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ఈనెల 27వ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నాజర్ పేట ఎన్వీ ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. ప్రముఖ డైలాగ్ రైటర్ డాక్టర్ సాయి మాధవ్ బుర్ర సభా నిర్వహణలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార గ్రహీత ప్రఖ్యాత సినీ నటి జయప్రదకు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ చేతుల మీదుగా పురస్కారాన్ని అందించబోతున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి జయప్రకాశ్ నారాయణ ముఖ్య అతిథిగా, సుప్రసిద్ధ సినీ దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి ఆత్మీయ అతిథి గా వ్యవహరించనున్నారు. వీరు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ అభిమాన సత్కార గ్రహీత డాక్టర్ మైధిలి అబ్బరాజు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలానే, ఈ శత జయంతి ఉత్సవాలులో భాగంగా తెనాలి పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్ లో ఏడాది పొడవునా ఎన్టీఆర్ చలన చిత్రాలు ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం (28/11/2022)నాడు ‘అడవి రాముడు’ సినిమాను ప్రదర్శిస్తునారు. ఈ ప్రదర్శనకు జయప్రద, నందమూరి రామకృష్ణ, ఏ. కోదండరామిరెడ్డి హాజరై ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించనున్నారు.