వచ్చే ఏడాది పాకిస్తాన్ లో జరిగే ఆసియా కప్ లో ఆడేందుకు భారత జట్టు రాకపోతే తాము కూడా ఆ దేశంలో నిర్వహించే వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనేది లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా స్పష్టం చేశాడు.
ఆసియ కప్ ను తటస్థ వేదికకు మార్చాలని, పాకిస్తాన్ లో జరిగితే తాము పాల్గొనేది లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జై షా అక్టోబర్ లో వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై రమీజ్ రాజా స్పందించాడు. ఆసియా కప్, టి 20 వరల్డ్ కప్ లో ఇండియాను పాకిస్తాన్ ఓడించిన విషయాన్ని గుర్తు చేస్తూ ‘ బోర్డ్ అఫ్ బిలియన్ డాలర్స్ ఎకానమీ’అంటూ బిసిసిఐపై చెణుకులు విసిరాడు. ఆ జట్టుపై తాము ఒకే ఏడాది రెండు సార్లు విజయం సాధించిన విషయం మర్చిపోకూడదన్నాడు. ‘మొదట వారు వస్తారో రారో చూద్దాం, ఆ తరువాత మా వైఖరి మేము చెబుతాం’ అంటూ వ్యాఖ్యానించాడు.
తటస్థ వేదికలో ఆసియా కప్ నిర్వహించాలంటూ జై షా చేసిన ప్రకటన అప్పట్లో దుమారం లేపింది. నేరుగా దీనిపై విమర్శలు చేయకపోయినా ఇలాంటి వ్యాఖలు సమంజసం కాదని పలువురు క్రీడా వేత్తలు అభిప్రాయపడ్డారు. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ భారత్ లో నిర్వహిస్తోన్న వరల్డ్ కప్ లో అన్ని దేశాలూ పాల్గొంటాయని ధీమా వ్యక్తం చేశారు.
తాము ఏదేశంలో పర్యటించాలనే దానిపై సొంత నిర్ణయం తీసుకోలేమని, భారత ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి తాము ముందుకు వెళ్ళాల్సి ఉంటుందని బిసిసిఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ స్పష్టం చేశారు. మన జట్టు వేరే దేశానికి వెళ్ళాలన్నా, వేరే జట్లు మన దేశంలో పర్యటించాలన్నా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అనుమతి కావల్సిందేనని, ఆసియా కప్ లో ఆడే విషయంలో కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తాము పాటిస్తామని చెప్పారు.