ఇటలీలోని ఓడరేవు నగరమైన ఇస్కియా ద్వీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో మూడు వారాల చిన్నారి కూడా ఉన్నది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురు బురదలో కూరుకుపోయారు.
ఇస్కియా ద్వీపంలో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో సముద్ర తీరంలోనే ఉన్న ఒక భారీ కొండపై నుంచి కొంత భాగం జారిపోయింది. ఒక్కసారిగా నెట్టుకొచ్చిన కొండచరియల తాకిడికి కొండ కింద ఉన్న భవనాలు కూలిపోయాయి. పలు వాహనాలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి.
ఇస్కియాలో 6 గంటల్లో 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 20 ఏండ్లలో ఆ ప్రాంతంలో అంత భారీ వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. కాగా ఘటనా ప్రాంతంలో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.