వివాహ వేడుకలకు సంబంధించి ముస్లిం మత పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ముస్లిం వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేయడం, సంగీతం (డీజే), బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తున్నట్లు ఝార్ఖండ్ దాన్‌బాద్ జిల్లా ముస్లిం మతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు డిసెంబర్ 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని నిర్సా బ్లాక్‌లోని సిబిలిబడి జామా మసీదు హెడ్ ఇమామ్ మౌలానా మసూద్ అక్తర్ తెలిపారు.
వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేయడం, సంగీతం ప్లే చేయడం, బాణాసంచా కాల్చడం ఇస్లామిక్ వ్యతిరేక పద్ధతులు. వివాహ వేడుకల్లో ఇకపై వీటిని నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. ఈ ఆదేశాలు డిసెంబర్ 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.5,100 జరిమానా విధిస్తాం. అదేవిధంగా రాత్రి వేళ వివాహాలు రద్దు చేస్తున్నాం. రాత్రి 11 గంటలలోపు వివాహం జరిపించాలి. 11 గంటల తర్వాత ఎవరైనా నికాహ్ చేయడానికి ప్రయత్నిస్తే వారికి కూడా జరిమానా విధిస్తాం. నిబంధనలను ఉల్లంఘించిన వారు రాతపూర్వకంగా క్షమాపణలు కూడా చెప్పాల్సి ఉంటుంది’’ అని అక్తర్ వివరించారు