Sunday, November 24, 2024
HomeTrending Newsవిద్యార్థుల‌కు స్కూల్ డ్రెస్సులు సిద్ధం చేయండి : మంత్రి స‌బిత‌

విద్యార్థుల‌కు స్కూల్ డ్రెస్సులు సిద్ధం చేయండి : మంత్రి స‌బిత‌

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు రానున్న విద్యా సంవత్సరం పాఠశాలల పునః ప్రారంభ సమయంలోనే స్కూల్ డ్రెస్సులను అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు స్కూల్ డ్రెస్సులను ధరించి తరగతులకు హాజరైతే వారిలో క్రమశిక్షణ ఏర్పడుతుందని పేర్కొన్నారు. స్కూల్ డ్రెస్సుల పంపిణీ, మన ఊరు – మన బడి సమీక్ష సమావేశాన్ని పాఠశాల విద్య సంచాలకులు కార్యాలయంలో నిర్వహించారు.

రానున్న విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి 25 లక్షల మంది విద్యార్థులకు రూ. 121 కోట్లతో స్కూల్ డ్రెస్సులను రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థులందరూ ఒకే రకమైన దుస్తులు ధరించడం ద్వారా వారి మధ్య తారతమ్యాలు, ఎలాంటి కల్మషాలకు తావు లేకుండా ఉండే అవకాశం ఉంటుంద‌ని మంత్రి తెలిపారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు జిల్లా స్థాయిలో దుస్తుల‌ను సిద్దంగా ఉంచాలని ఆదేశించారు.

మన ఊరు – మన బడి కార్యక్రమంలో మొదటి దశలో చేపట్టిన 1200 పాఠశాలల్లో నిర్మాణ పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. వీటిలో సీసీటీవీ కెమెరాలు, ఫర్నీచర్, ఉన్నత పాఠశాలల్లో క్రీడా మైదానాలను డిసెంబర్ 15 నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మిగతా పాఠశాలల్లో కూడా పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు శ్రీ దేవసేన తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్