ఒకప్పుడు వలసల జిల్లాగా ఉన్న మహబూబ్ నగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్ గా మారుస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ సమీపంలోని దివిటిపల్లి వద్ద ఐటీ, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయగా… అమర్ రాజా బ్యాటరీస్ గ్రూప్ 250 ఎకరాల్లో రూ.9500 కోట్లతో లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే భారీ పరిశ్రమను నెలకొల్పేందుకు శుక్రవారం నాడు మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంఓయు పూర్తయింది. తొలి దశలో సుమారు 5000 మందికి, క్రమంగా 10వేల మంది వరకు ఉపాధి అందించే ఈ పరిశ్రమను మహబూబ్ నగర్ కు తీసుకువచ్చినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వివరించారు.
భవిష్యత్తులో వివిధ సాఫ్ట్ వేర్ కంపెనీలను ఏర్పాటు చేసే విధంగా నిర్మించిన ఐటీ టవర్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని, త్వరలోనే ఐటీ టవర్ ను ప్రారంభిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. హన్వాడ వద్ద కూడా సుమారు 500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఫుడ్ పార్క్ వల్ల మహబూబ్ నగర్ పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ మీదుగా పలు జాతీయ రహదారులు, రైల్వే డబుల్ లైన్ ద్వారా చక్కని రవాణా వసతి సౌకర్యం ఉండడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధికి మరింత అవకాశం ఉందని తెలిపారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం ఒక గంటలో చేరుకొనే అవకాశం ఉండడం ఈ ప్రాంతానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తోందని మంత్రి వివరించారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని దీంతో మహబూబ్ నగర్ దశ తిరుగుతుందని ఆయన అన్నారు.