అడివి శేష్ హీరోగా నాని నిర్మాతగా శైలేశ్ కొలను రూపొందించిన ‘హిట్ 2’ సినిమా నిన్న థియేటర్లకు వచ్చింది. ఇది క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ. అడివి శేష్ ఎంచుకునే కథలు .. పాత్రలు ఈ తరహా జోనర్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. యాక్షన్ .. సస్పెన్స్ .. మిస్టరీ .. ఇలా ప్రధానమైన లైన్ ఏదైనప్పటికీ వాటికి థ్రిల్లర్ యాడ్ అయ్యేలా చూసుకుంటున్నాడు. తాను ఎంచుకునే కథల పట్ల ప్రేక్షకులకు నమ్మకాన్ని కలిగించడమే తన ప్రధాన ఉద్దేశమని ప్రమోషన్స్ లో పదే పదే చెబుతూ వచ్చాడు.
దాంతో శేష్ కి ఈ కథపై ఉన్న నమ్మకమే చూసిన ప్రేక్షకులు విషయం బలంగానే ఉంటుందని ఓపెనింగ్ రోజున ఆ ఎఫెక్ట్ థియేటర్ల దగ్గర కనిపించింది కూడా. సాధారణంగా మర్డర్ మిస్టరీ కథలు .. సైకో థ్రిల్లర్ కథలు ఒక మూస పద్ధతిలో నడుస్తుంటాయి. టేకింగ్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కెమెరా వర్క్ అనేవి ఈ తరహా కథలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతూ ఉంటాయి. కథాకథనాల పరంగా ‘హిట్ 2’లో ఉన్న కొత్తదనం ఏంటో తెలుసుకోవాలని థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులను మాత్రం పాత ఫార్మేట్ నే పలకరిస్తుంది.
కథాకథనాల విషయంలో దర్శకుడు ఫలానా చోట కొత్తగా ట్రై చేశాడని ఎక్కడా అనిపించదు. ఉన్న ప్రధానమైన పాత్రలు తక్కువే అయినా ఆ పాత్రలను సరిగ్గా డిజైన్ చేయలేదు. రావు రమేశ్ .. పోసాని .. సుహాస్ వంటి మంచి ఆర్టిస్టులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు. కథను ఎత్తుకున్న తీరులోనే దర్శకుడు తడబడ్డాడని అనిపిస్తుంది. ఎక్కడో ఫ్లాష్ బ్యాక్ లో రావలిసిన ఎపిసోడ్ ను ముందుగానే చెప్పేశాడు. అవసరానికి మించి తెరపై రక్తపాతం చూపించాడు. ఎమోషన్ అనేది ఆడియన్స్ కి ఎక్కడా కనెక్ట్ కాదు. అడివి శేష్ మార్క్ యాక్టింగు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ … కెమెరా వర్క్ ఈ సినిమాను కొంతవరకూ కాపాడటానికి ట్రై చేశాయని చెప్పచ్చు.