మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 సెక్షన్ 17 A / 11 A ప్రకారం సింగరేణి సంస్థకు ఓపెన్ టెండర్ తో సంబంధం లేకుండా కోల్ బ్లాక్స్ ను రిజర్వ్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ అండర్ గ్రౌండ్ అండ్ ఓపెన్ కాస్ట్ కోల్ మైన్స్ ను గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్ ( GVCF ) పరిధిలో కలిగి ఉందని, మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 సెక్షన్ 17 A / 11 A ప్రకారం గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్ పరిధిలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ సింగరేణి సంస్థకు కోల్ బ్లాక్స్ ను రిజర్వ్ చేసే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించకోవడం లేదని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్ పరిధిలో ఉన్న కళ్యాణ ఖని, కోయలగూడెం, శ్రావణపల్లి, సత్తుపల్లి కోల్ బ్లాక్స్ ను సింగరేణి సంస్థకు కేటాయించాల్సి ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకగానే సింగరేణి సంస్థ విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని, పైగా కోయాల గూడెం కోల్ బ్లాక్ ను ఇప్పటికే వేలం వేసి ప్రైవేట్ సంస్థకు అప్పగించింది అని వినోద్ కుమార్ తెలిపారు.
బొగ్గు గనులను వేలం వేసే ప్రక్రియ శరవేగంగా సాగుతోందని, బొగ్గు గనుల వేలం పాటల పరంపరకు కేంద్ర ప్రభుత్వం టెండర్ షెడ్యూల్ ను తాజాగా ప్రకటించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణిని ప్రైవేటుపరం చేయమని ఒక వైపు చెబుతూనే.. దేశంలోని బొగ్గు గనుల బ్లాకులను వేలం వేస్తూ సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో వైపు చేస్తున్న ఈ టెండర్ ప్రక్రియకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం సమాధానం చెబుతారు అని వినోద్ కుమార్ ప్రశ్నించారు.
ఇటీవల రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు విచ్చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణిలో 51% శాతం వాటా ఉందని, కేంద్ర ప్రభుత్వానికి కేవలం 49 శాతం వాటా ఉందని, అలాంటప్పుడు సింగరేణి సంస్థను తాము ప్రైవేట్ పరం ఎలా చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారన్నారు. ఆచరణలో మాత్రం వ్యవహారం అందుకు భిన్నంగా ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. సింగరేణి సంస్థ జోలికి వెళ్ళమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన మాటలకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బొగ్గు గనుల వేలంపాటల ప్రక్రియకు ఎక్కడా కూడా పొంతన లేకుండా ఉందని వినోద్ కుమార్ అన్నారు. బొగ్గు గనుల బ్లాకులను వేలం వేసేందుకు టెండర్ షెడ్యూల్ ప్రకటించిన విషయాన్ని వినోద్ కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం కోసం ప్రకటించిన తాజా టెండర్ షెడ్యూల్ ను వినోద్ కుమార్ మీడియాకు విడుదల చేశారు.
ఇప్పటికే సింగరేణి సంస్థకు బొగ్గు గనుల బ్లాకులు దక్కకుండా ఆగస్ట్ 10 వ తేదీ 2022 నాడు నిర్వహించిన వేలం పాటలో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కోయలగూడెం – lll కోల్ బ్లాక్ ను ఔరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అప్పగించిందని వినోద్ కుమార్ గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా సింగరేణి సంస్థకు బొగ్గు గనులు దక్కకుండా చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోందని వినోద్ కుమార్ ఆరోపించారు. కోల్ బ్లాక్స్ చేతిలో లేకుంటే సింగరేణి సంస్థ ఏం పని చేయాలి అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న సుమారు 60,000 వేల మంది కార్మికులు, ఉద్యోగులను రోడ్డు పాలు చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని వినోద్ కుమార్ ఆరోపించారు.