రాష్ట్రంలో మే 5 నుంచి జరగాల్సిన ఇంటర్మీడియేట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. హైకోర్టు సూచనలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తరువాత తదుపరి తేదీలను వెల్లడిస్తామని చెప్పారు.
పరీక్షలకు సంబంధించి దేశం అంతటికీ వర్తించేలా ఒకేలా నిబంధనలు విధించకపోవటం వల్ల కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు ఇప్పటికే నిర్వహించేశారని, మరి కొన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారని మంత్రి చెప్పారు. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని భావించామన్నారు
.పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాలని రాష్ట్ర హైకోర్టు కూడా అభిప్రాయపడినందున, కోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షల వాయిదాను ప్రకటిస్తున్నామని మంత్రి సురేష్ చెప్పారు.