గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యాలుగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పాలన సాగుతోందని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లో ఈ రోజు (మంగళవారం) మంత్రి నాగోల్ నుంచి బండ్లగూడ వరకు నిర్మించిన బాక్స్ డ్రైన్, ఫతుళ్లగూడ నుంచి పీర్జాదిగూడ లింక్‌రోడ్డు, ముక్తిఘాట్, పెంపుడు జంతువుల శ్మశాన వాటికను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గ పరిధిలో రూ.55కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలని, సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ఓ వైపు సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాలు అందేలా సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. కల్యాణలక్ష్మి, ఆసరా పథకం, కేసీఆర్ కిట్ ఇలా ఎన్నో రకాల పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభుత్వం ఆదుకుందని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణలో మళ్లీ వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘నాగోల్, ఎల్‌బీ నగర్ వరకు మెట్రో పూర్తయ్యింది. నాగోల్ నుంచి ఎల్‌బీనగర్ మధ్య ఐదు కిలోమీటర్ల మార్గాన్ని రెండో ఫేజ్‌లో కలిపే ప్రయత్నం చేస్తాం. రేపే చేస్తామని చెపితే చేయలేదని అంటారు. అందుకే ముందుగానే చెబుతున్నా. నాకు తెలుసు, మీకు తెలుసు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది సీఎం కేసీఆరే.. వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే.. వచ్చే ఎన్నికల తర్వాత ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోను విస్తరిస్తాం. ఆ దిశగా ప్రజారవాణా విస్తరించే ప్రయత్నం చేస్తాం. టిమ్స్ ఆసుపత్రి గడ్డి అన్నారంలో రాబోతుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి, సిని నటి అమల, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితర నేఆయకులు పాల్గొన్నారు.