Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంద్వితీయోద్యోగ పర్వం

ద్వితీయోద్యోగ పర్వం

Shortage of time: ఇరవై ఏళ్ల వయసు దాటకముందే జర్నలిజంలోకి వచ్చి…విలేఖరిగా పని చేస్తూ జర్నలిజం పాఠాల కంటే గుణపాఠాలే ఎక్కువ నేర్చుకుని…జర్నలిజానికి పనికిరాను అనుకుని పక్కకు వచ్చేశాను. అలా పక్కకు రావడానికి 17 ఏళ్లు పట్టింది. ఈలోపు రాత్రి సబ్ ఎడిటర్ ఉద్యోగం చేస్తూ పగలు యాడ్ ఏజెన్సీల్లో ఇంగ్లీషు ప్రకటనలకు తెలుగు అనువాదాలు చేసేవాడిని. క్లయింట్ సమ్మతించిన అనువాదాలకు మాత్రమే నామమాత్రపు రెమ్యునరేషన్ ఇచ్చేవారు. నెలకు నాలుగయిదు వందలు వచ్చేది. అప్పుడు అదే గొప్ప. కానీ నిద్ర లేక ఆరోగ్యం దెబ్బతినేది. తరువాత రాత్రి ఉద్యోగం చేస్తూ పగలు ఏ పి పి ఎస్ సి పోటీ పరీక్షల కోచింగ్ కు వెళ్లేవాడిని. మూడు, నాలుగు సార్లు ప్రిలిమ్స్ లోనే ఫెయిలయి పక్కకు వచ్చేశాను.

రాత్రి డ్యూటీల ప్రింట్ మీడియా నుండి బయటపడాలన్న పట్టుదలతో బయటికి వచ్చి కొంతకాలం సంస్కృతాన్ని ఇంగ్లీషులో బోధించే విచిత్రమయిన లెక్చరర్ గా పనిచేశాను. ఆ పోస్ట్ ఎయిడెడ్ అయ్యే అవకాశం లేకపోవడంతో పరిస్థితి పెనం మీదినుండి తీసి పొయ్యిలోకి వేసినట్లయి మళ్లీ టీ వీ మీడియాలోకే వచ్చాను. షరామామూలు అంతఃపుర కలహాలు, సభా మర్యాద దృష్ట్యా చెప్పడానికి వీలుకాని కొన్ని కారణాల వల్ల టీ వీ జర్నలిస్టుగా మానేసి ఒక కంపెనీలో పి ఆర్ ఓ గా చాలా కాలం పనిచేశాను. ఒక పెద్దమనిషిని నమ్మి మళ్లీ ఒక ఛానెల్ హెడ్ గా రావడంతో రెండేళ్లు నరకం చూశాను.

ఆ నరకమే నాకొక దారి చూపింది. ఆ నరకంతో పోలిస్తే ప్రపంచంలో ఇంకేదయినా బాగానే ఉంటుందన్న తెగింపు వచ్చి మీడియా వ్యాపారంలోకి వచ్చాను. నమ్మించి మోసం చేసినవారి వల్ల కోట్లల్లో నష్టపోయినా…వ్యాపారం ఎలా చేయకూడదో మొదటి రెండు మూడేళ్ళలోనే తెలుసుకోగలిగాను. ఇప్పటికీ అలాంటివే జరుగుతున్నా నాకోసం నిలబడే పెద్దలు ఉండబట్టి నిలబడగలిగాను. వ్యాపారంలో ఎన్ని రకాల మోసాలు, ఎలా జరుగుతాయో? తెలిసి తెలిసి మనం ఎలా మోసపోతామో? ఆదర్శాలకు కేరాఫ్ అడ్రస్ లా బయట పేరు తెచ్చుకున్నవారు ఎంత నీచంగా ప్రవర్తిస్తారో? లక్షలు, కోట్లల్లో పని చేయించుకుని డబ్బు ఎలా ఎగ్గొట్టి ఎంత దర్జాగా తిరుగుతుంటారో? అన్న వివరాలతో ఎప్పటికయినా ఒక పెద్ద పుస్తకం రాయాలని ఉంది. నాలాగా నలిగిపోకుండా ఒక్కరికయినా ఉపయోగపడుతుందని ఆశ.

వ్యాపారంలో ఎగుడు దిగుళ్లు సహజం. వ్యాపారం దెబ్బతిన్న ప్రతి సందర్భంలో జర్నలిజం, తెలుగు నన్ను ఆదుకున్నాయి. జర్నలిజం స్కూళ్ళు, కాలేజీల్లో పాఠాలు చెప్పేవాడిని. పారితోషికం ఇస్తే తీసుకునేవాడిని. లేకపోతే లేదు. కానీ ఒక ప్రత్యామ్నాయ ఉపాధిగా ధైర్యమిచ్చింది.

ఒక ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడాన్ని ఇప్పుడు “మూన్ లైటింగ్” అంటున్నారు. ప్రత్యేకించి కోవిడ్ మొదలయ్యాక వర్క్ ఫ్రమ్ హోమ్ రోజుల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఏకకాలంలో రెండు మూడు ఉద్యోగాలు చేయడం మొదలు పెట్టారు. విప్రో లాంటి కంపెనీలు మూన్ లైటింగ్ ను వ్యతిరేకించాయి. మహీంద్రా లాంటి కంపెనీలు తప్పు కాదన్నాయి.

న్యాయవాదిగా కెరీర్ మొదలు పెట్టిన తొలినాళ్లలో జీతం చాలక పార్ట్ టైమర్ గా రేడియో జాకీగా రెండో ఉద్యోగం కూడా చేశానని భారత సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ చెప్పారు. ఎంతటివారికయినా కుదురుకునే వరకు ఈ తిప్పలు తప్పవని పరోక్షంగా మూన్ లైటింగ్ కు మద్దతు తెలిపారు. చేస్తున్న ఉద్యోగ విధులకు భంగం కానంతవరకు మూన్ లైటింగ్ తప్పు కాదు అన్నది మెజారిటీ అభిప్రాయం.

తెలుగు వేన వేల కథల్లో ముందు వరుసలో ఉండే ఒకానొక కథ “పొద్దు చాలని మనిషి”. ప్రఖ్యాత కథారచయిత మధురాంతకం రాజారామ్ రాసిన వందల కథల్లో మేలిమి వజ్రం లాంటి కథ.

ఈ కథలో ఇద్దరు కాలేజీ నాటి మిత్రులు. ఒకాయన చదువు పూర్తి కాగానే టీచర్ అయి పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటాడు. మరొకాయన పెద్దగా చదువు అబ్బకపోయినా ఎలాగో డిగ్రీ పూర్తి చేసి పట్టణంలో స్థిరపడి ఏకకాలంలో చిన్నా, పెద్ద పనులు అనేకం చేస్తూ ఉంటాడు. ఒక రోజు సూర్యోదయానికంటే ముందు నుండి రాత్రి అందరూ నిద్రపోయేవరకు ఆయన చేసే పనులు, అందులో వేగం, నైపుణ్యాన్ని మధురాంతకం మాటల్లోనే తెలుసుకోవాలి. రోజుకు 24 గంటలే ఉండడం వల్ల ఆయన అన్ని పనులతోనే సరిపెట్టుకున్నాడు. లేకపోతే ఇంకా చాలా చేయగలడు. నిజానికి ఆయన “పొద్దు చాలని మనిషి” అని కథా శీర్షికకు న్యాయం చేస్తూ కథను ముగిస్తారు మధురాంతకం.

లోకంలో-
పొద్దుపోనివారు కొందరు.
పొద్దు చాలనివారు కొందరు.
మూన్ లైటింగ్ చేస్తున్నా మూన్ లైట్ చూడలేనివారు ఎందరో!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

వర్క్ ఫ్రమ్ హోమ్ కాంతులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్