Our Roots: పట్టణీకరణ, నగరీకరణ ఎంత వేగంగా వ్యాప్తి అవుతున్నా…
పల్లెలు ఇళ్లు ఖాళీ చేసి పట్టణాలకు వలస పోతున్నా…
పట్టణాలకు చాకిరీ చేసే కూలీలుగా పల్లెలు మారిపోతున్నా…
నగరాల్లో పల్లెలు ఎగ్జిబిషన్ వస్తువులుగా ఎంతగా మారిపోతున్నా…
పాలను ఫ్యాక్టరీల్లో తయారు చేస్తారనుకునే ప్యాకెట్ ఫుడ్ తరం ఎంతగా ఎదుగుతున్నా…
ఇంట్లో కూడా పాలరాతి దుమ్ము కాలికి తగలకుండా చెప్పులతో తిరిగే నేల విడిచి సాము చేసే మనుషులు ఎంతగా పుట్టి పెరుగుతున్నా…
ఇప్పటికీ…పల్లె అందమే అందం. పట్టణాలు, నగరాలది మేకప్ పెట్టుడు అందం. కట్టుడు అందం. ఒక వర్షం పడితే నగరం మేకప్ పొంగిన మురికి కాలువలో తుడిచిపెట్టుకుపోతుంది. ఒక ఎండ కాస్తే నిలువ నీడలేక మాడి మసై పోతుంది.
వసతులు, సౌకర్యాలు, విలాసాలు సాపేక్షకం. నగరంలో అన్ని వసతులు ఉండే మాట నిజమే. ఆ వసతులేవీ సహజం కాదు. ఉచితం కాదు. చెట్టు గాలి, ఈత కొలను, నడిచే బాట, ఊగే ఊయల, కాచే ఎండ అన్నిటికీ నగరాల్లో ఒక విలువ ఉంటుంది. ఆ విలువ పెట్టగలిగే స్థోమత ఉంటేనే మన గుమ్మంలోకి సూర్యుడు వస్తాడు. అంత ఖర్చు పెట్టగలిగితేనే మన ఇంటికి ఒక పెరడు, ఆ పెరటి బాల్కనీలో ఒక మొక్క, ఆ మొక్క మీద ఒక పురుగు వాలుతాయి. లేదంటే ఇంటి నిండా ప్లాస్టిక్ మొక్కలు, వాటికి కాగితం పూలే దిక్కు.
నాగరికత అన్న మాట పుట్టినప్పుడే పల్లెకు చాలా అవమానం జరిగింది. నగరానికి సంబంధించినది నాగరికత. అంటే పల్లెకు నాగరికత లేదని మనకు మనమే తీర్మానించి…పల్లెను అనాగరికం చేసి…మనల్ను మనమే అవమానించుకున్నాం. అవమానాన్ని దిగమింగుకుని తరతరాలుగా పల్లె మనకు పట్టెడన్నం పెడుతోంది కాబట్టి నగరాల్లో బతికి బట్టకట్టగలుగుతున్నాం. లేకపోతే మన నోట్లో మట్టి కూడా మిగలదు.
నగర జీవనంతో ఎన్ని రోగాలు వచ్చాయో? ఇంకా ఎన్నెన్ని చిత్ర విచిత్రమయిన రోగాలు రానున్నాయో? మీకు తెలిసిన జెనరల్ ఫిజీషియన్ ను అడగండి. పూసగుచ్చినట్లు చెబుతారు.
ఉన్న ఊళ్లో ఉపాధి ఉంటే…పల్లె వదలాల్సిన అవసరమే ఉండేది కాదన్నది కాదనలేని సత్యం. నగర జీవనంలో ఆధునిక వసతులు ఒక ఆకర్షణ. వల. దాంతో వచ్చే కొల్లాటెరల్ డ్యామేజ్ గురించి ఇక్కడ చర్చ అనవసరం. బతుకుతెరువుకు మించిన ప్రాధాన్యం ఏముంటుంది? తప్పదు.
ఏమీ లేకపోయినా…
ఎంతగా శిథిలమయినా…
ఎంత ముసలి అయినా…
పల్లె దానికదిగా పుట్టి…ఎదిగి…పూచి…కాచి…పండిన మహా ఫల వృక్షం. దాని ఊడలు నగరాలదాకా విస్తరించి ఉంటాయి. పట్టణాలు, నగరాలతో పల్లెలది పేగు బంధం. కోస్తే తెగిపోయేది కాదది.
పల్లె అందం-
కవిలో భావుకతను నిద్ర లేపుతుంది. చిత్రకారుడి కుంచెకు రంగులు చల్లుతుంది.
గాయకుడి స్వరానికి రెక్కలు తొడుగుతుంది.
గాలికి గంధం పూస్తుంది.
నేలకు ముగ్గులు వేస్తుంది.
నీటికి ఈత నేర్పుతుంది.
కొమ్మకు ఊయల కడుతుంది.
కోయిల గొంతుకు పాటను కడుతుంది.
అలా వీకెండ్ పార్టీ సినిమాలో ఒక సందర్భానికి గేయరచయిత చంద్రబోస్ పల్లె తాత్వికతకు అద్దం పడుతూ చక్కటి పాట రాశారు. వైవిధ్యమయిన గొంతుతో పాడే కైలాష్ ఖేర్ తో పాడించడంతో పల్లె సాహిత్యానికి తగిన జానపద న్యాయం జరిగింది.
పల్లెలా స్వచ్ఛంగా, సరళంగా ఉంది కాబట్టి దీనికి ప్రతిపదార్థం, బిట్వీన్ ది లైన్స్ అర్థం, విశేషార్థాలు- వ్యాఖ్యలు అనవసరం. ఊరికే చదవండి. లేదా యూట్యూబ్ లో చూడండి. మీరు వదిలి వచ్చిన లేదా నడిచి వచ్చిన పల్లె కనిపిస్తుంది.
సినిమా:- వీకెండ్ పార్టీ
రచన:- చంద్ర బోస్
గానం:- కైలాష్ ఖేర్
సంగీతం:- సదాచంద్ర
దర్శకుడు:- అమరేందర్
సాకీ:-
“నేలతల్లికి తొలుసూరు బిడ్డ పల్లెటూరు
ఇళ్లన్నీ చుక్కలుగా వేసిన పెద్ద ముగ్గే పల్లెటూరు
మట్టిని ముద్దాడే పాదాలు ప్రవహించే చోటే పల్లెటూరు
పల్లవి:-
లే లే లే లే లెమ్మంటూ సూర్యుడ్ని నిద్దర లేపడం
లేచి కూత పెట్టమంటూ కోడిపుంజును తొందర పెట్టడం
పేడ నీళ్లతో అలుకు చల్లడం
నల్ల బొగ్గుతో పళ్లు తోమడం
గిలక బావిలో నీళ్లు తోడడం
మట్టి కుండలో వంట వండడం
ప్రకృతి మాత ఒడిలో నిత్యం పసిపాపలుగా బతకడం-
పల్లెటూరిలోనే సాధ్యం
ఇది పల్లెటూరిలోనే సాధ్యం
చరణం-1
పంచాయతీలో ఒక్కరి మాటకు అందరు కట్టుబడి ఉండడం
పక్కింటి కూరలు ఈ ఇంటి అన్నంతో అనుబంధాన్నే కలపడం
ఎవరో తెలియని అతిథుల కోసం ఇంటికి అరుగులు కట్టడం
చీమలు తినడం కోసం బియ్యప్పిండితో ముగ్గులు వేయడం
తురక దూదేకుల పీర్లను ఎల్లయ్యే ఎత్తుకు తిరగడం
శ్రీరామనవమి వడపప్పును చాంద్ పాషా అందరికి పంచడం
ప్రకృతి మాత గుడిలో నిత్యం భక్తులుగా బతికేయడం
పల్లెటూరిలోనే సాధ్యం
ఇది పల్లెటూరిలోనే సాధ్యం
చరణం-2
గోచి కట్టినా…కాసె పోసినా
అశ్లీలత అనిపించదు
పనిపాట్లలో తిట్లు దొర్లినా
అసభ్యంగ వినిపించదు
చెంబూ చేటా బయటే ఉన్నా
దొంగలు రారని నమ్మకం
విత్తులు, నాగలి సిద్ధం చేసి
వానొస్తుందని విశ్వాసం
పురుగు పుట్రలతో కలిసుంటూ
చావొస్తే రానివ్వమను ధైర్యం
ప్రకృతి మాత ఒడిలో నిత్యం
విద్యార్థులుగా బతకడం
పల్లెటూరిలోనే సాధ్యం
ఇది పల్లెటూరిలోనే సాధ్యం”
ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ లో పాట వినవచ్చు. చూడవచ్చు.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :
Also Read :