Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅయిదూళ్ల ఆహ్వానం

అయిదూళ్ల ఆహ్వానం

Wedding Card : మనసుంటే మార్గముంటుంది. పెద్ద మనసు చేసుకుంటే ఆ మనసు ఎంత పెద్దదో తనకే తెలియనంతగా పెరుగుతూ ఉంటుంది. అంత పెద్ద మనసుతో చేసే పనులు ఎంత పెద్దవిగా ఉంటాయో తెలుసుకోవడానికి తమిళనాడు తంజావూరు జిల్లా కుంభకోణం దగ్గర తిరువిడైమరుదూరు పక్కన మల్లపురం పంచాయతీ దాకా వెళ్లాలి. మల్లపురం పంచాయతీలో ఉన్న అయిదు పల్లెల్లో ఉన్నవి 900 కుటుంబాలు. ఇందులో అన్ని మతాలు, కులాలు, వృత్తులవారు ఉన్నారు.

మల్లపురం పంచాయతీకి వరుసగా రెండోసారి ప్రెసిడెంటుగా ఎన్నికయిన రమేష్ కూతురికి పెళ్లి నిశ్చయమయ్యింది. ముహుర్తాలు చూసుకున్నాక పెళ్లి పత్రిక ముద్రించడం పరిపాటి. ఇక్కడే పంచాయతీ ప్రెసిడెంటుకు పెద్ద చిక్కొచ్చి పడింది. పత్రిక మీద ఆహ్వానించేవారుతో మొదలు పెట్టి…కింద నలుగురు పెద్దల పేర్లు పెట్టి…షరామామూలుగా “మరియు బంధు మిత్రులు” అని పెట్టి వదిలేస్తారు. ఈరోజుల్లో ఆ నలుగురి పేర్లు ముద్రించేవారు కూడా కనపడ్డం లేదు. అలాంటిది…తన పంచాయతీ పరిధిలోని అయిదు ఊళ్ళల్లో ఉన్న 900 కుటుంబాల భార్యా భర్తల పేర్లు ముద్రించాలంటే రమేష్ మనసు ఎంత పెద్దది అయి ఉండాలి?

Wedding Card

కూతురి పెళ్లికి ముహూర్తం నిర్ణయం కాగానే రమేష్ చేసిన పని- అందరి పేర్లు సేకరించడం. ఒక్క కుటుంబాన్ని కూడా విస్మరించకుండా 900 దంపతుల పేర్లతో పెద్ద వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించాడు. ప్రతి ఇంటికి తనే వెళ్లి…దగ్గరుండి తాంబూలం పళ్లెంలో ఆహ్వాన పత్రికను పెట్టి…మా అమ్మాయిని మీ అమ్మాయిగా భావించి…పెళ్లి పెద్దలుగా రండి. మదర్పిత చందన తాంబూలాలను స్వీకరించి…నూతన దంపతులను ఆశీర్వదించండి…అని అయిదు ఊళ్లను పిలిచాడు.

ఎవరికి వారు పత్రికలో తమ పేరు చూసుకుని…పొంగిపోయి పెళ్లి పనులు మీద వేసుకుని…బాధ్యతగా ఫీల్ అయ్యారు. కులం, మతం, వృత్తి, పేద- ధనిక తారతమ్యాలు లేకుండా అందరికీ సమాన ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ పత్రిక జాతీయ వార్త అయ్యింది.

మా ప్రెసిడెంటు సెంటిమెంటుతో మమ్మల్ను కట్టి పడేశాడు…అని ఆ పెళ్లి పత్రికను వదలకుండా పట్టుకుని తిరుగుతున్నాయి ఆ అయిదు ఊళ్లు. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఒక పత్రిక అయిదు ఊళ్లను కదిలించింది.

ఫర్ సపోజ్…
ఈ రమేష్ పార్లమెంటు సభ్యుడు అయి ఉంటే…కనీసం అయిదు లక్షల దంపతుల పేర్లు పత్రికలో ముద్రించాల్సి వచ్చేది. ఎమ్మెల్యే అయి ఉంటే తక్కువలో తక్కువ డెబ్బయ్ అయిదు వేల దంపతుల పేర్లు ముద్రించాల్సి వచ్చేది. మనం అనుకుంటాం కానీ…ఇలాంటివారి మనసు వైశాల్యం ముందు డెబ్బయ్ అయిదు వేలు, అయిదు లక్షలు చాలా చిన్నవి. ఇరుకు మనసులో ఇద్దరికే చోటుకు లోటు. ఈ మనసులో జగమంత చోటు. ఎందరు ఎక్కినా ఇంకొకరికి చోటు ఇచ్చే పుష్పక విమానం అంటే ప్రతీకాత్మకంగా ఇదే.

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది.
మనసు మంచిదయితే ఊరు నిలబడుతుంది.

“పెళ్లి పిలుపు” “ఆశీర్వచనం” “అక్షతలు” “పెళ్లి భోజనం” అన్న మాటలకు వ్యుత్పత్తి అర్థాలు కావాలంటే మల్లపురం రమేష్ ను అడగండి. చెప్పకుండా చేతల్లో చూపిస్తాడు.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

శుభం పలకరా పెళ్లి కొడకా…అంటే…!

Also Read :

నాతో నాకే పెళ్లి

RELATED ARTICLES

Most Popular

న్యూస్