Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపతాక శీర్షికల చమత్కారం

పతాక శీర్షికల చమత్కారం

Heights of Headings: చాలా సందర్భాల్లో మీడియా శీర్షికలు కూడా చర్చనీయాంశమవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీడియా యాజమాన్యాల ఇష్టాయిష్టాలను బట్టి, వారి రాజకీయ అభిప్రాయాలను బట్టి పతాక శీర్షికలు వస్తుంటాయి.

నిన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మొన్న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వార్త ఒకటే. సారాంశం ఒకటే. కానీ ఉద్దేశాలు వేరు వేరుగా ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రింట్ మీడియాలో పతాక శీర్షికలు చూడండి.

వరుసగా ఏడోసారి గుజరాత్ లో బీ జే పి గెలిచింది. చిన్న విషయం కాదు. పైగా అసాధారణమయిన మెజారిటీ. దాంతో సహజంగా గుజరాత్ లో బి జె పి గెలుపు మెరుపు అయ్యింది. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుపు చిన్నబోయింది. అలాగని హిమాచల్ కాంగ్రెస్ గెలుపును తక్కువ చేయకుండా హస్తవాసిని ప్రస్తావించక తప్పలేదు.

తెలుగు మీడియాలో ఈనాడు కాషాయ సునామీ కింద హస్తవాసిని కూడా పట్టుకుంది. సాక్షి కూడా మోడీ మేజిక్ పక్కనే హిమాచల్ లో హస్తం హవాను ప్రస్తావించింది. ఆంధ్ర జ్యోతి మాత్రం గుజరాత్ లో కమాల్- హిమాచల్ లో ఢమాల్ అని గుజరాత్ లో గెలుపుకంటే హిమాచల్ లో ఓడినందుకు బి జె పి ఎక్కువ ఏడవాలన్నట్లు బ్యానర్ పెట్టింది. నమస్తే తెలంగాణ మొదటి పేజీ గుజరాత్ లో బిజెపి గెలుపు కంటే హిమాచల్ లో పరాభవానికే మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. 

ఇలాంటి సందర్భాలకు హెడ్డింగులు పెట్టడంలో టైమ్స్ ఆఫ్ ఇండియాది చాలా వైవిధ్యమయిన శైలి. ఇంగ్లీషు భాషకు భారతీయ మెరుపులు, విరుపులు అద్ది హెడ్డింగులు పెట్టడానికి అందులో ఒక బృందం ప్రత్యేకంగా పని చేస్తూ ఉంటుంది. ఇంగ్లీషు, హిందీతో పాటు ఇతర భారతీయ భాషలతో పరిచయమున్నవారు తప్ప ఇలాంటి హెడ్డింగులు పెట్టలేరు.
“Modi’s Guj Rath crushes congress, Aap”

Gujrath Bjp Victory
ఇందులో శబ్ద చమత్కారం, మాటల విరుపు వెతుక్కున్నవారికి వెతుక్కున్నంత. గుజరాత్ మాటలో రాత్ ను Rath- రథంగా వేరే రంగులో పెట్టి…ఆ మోడీ రథ చక్రాల కింద కాంగ్రెస్, ఆప్ నలిగిపోయాయని పద చిత్రాన్ని ఆవిష్కరించారు. కింద హిమాచల్ గురించి ప్రస్తావిస్తూ రివాల్వింగ్ డోర్ అంటే ఒకసారి బి జె పి , మరొకసారి కాంగ్రెస్ ను గెలిపించే హిమాచల్ అలాగే అధికారంలో ఉన్న బి జె పి ని ఓడించి కాంగ్రెస్ ను గెలిపించిందని హెడ్డింగులోనే ప్రకటించేశారు. హిందూ గుజరాత్, హిమాచల్ గెలుపుకు ఒకే హెడ్డింగ్ లో సమ ప్రాధాన్యం ఇచ్చింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా రెండిటికి ప్రాధాన్యమిచ్చింది.

కోటి మాటల కార్టూన్
ఇంగ్లీషు బిజినెస్ దినపత్రిక ఎకనమిక్ టైమ్స్ లో కార్టూన్ ఇది. కాంగ్రెస్ భవిష్యత్తును చెట్ల పొదల్లో దాగున్న ఆప్ అరవింద్ కేజ్రీవాల్ కు తాళంతో పాటు ఇచ్చేసి…దుకాణం కట్టేసుకుని పెట్టే బేడాతో వెళ్లిపోతున్న రాహుల్ సూట్ కేస్ మీద- “గుజరాత్ చోడో యాత్ర” అక్షరాలు.
అక్షరాలా భవిష్యత్తులో జరిగేది ఇదే. ఇది పేరుకు వ్యంగ్య చిత్రం. నిజానికిదే భవిష్యత్ చిత్రం!

కొసమెరుపు:-
వీటన్నిటికంటే గుజరాత్ లో పుట్టి దేశమంతా విస్తరించిన ఒక పాల ఉద్యమం అమూల్ కార్టూన్ మరింత ఆకట్టుకునేలా ఉంది. “గుజరాజ్” శీర్షిక. టేస్ట్ ఆఫ్ విక్టరీ ఉప శీర్షిక.

Gujrath Bjp Victory

మాటలు తెలియడం వేరు. ఆ మాటలను ఒడుపుగా విరవడం; విరిచి దురర్థం రాకుండా ఆ మాటలతో మరేదో అర్థం సాధించడం వేరు. ఇదొక విద్య. సృజనాత్మక కళ. ఇలాంటివారు ఇంకా మీడియాలో ఉండడం పాఠకులు ఎప్పుడో చేసుకున్న పుణ్య విశేషం. లేకపోతే వార్తతో పాటి హెడ్డింగులు కూడా పరమ నిర్జీవంగా ఉండి పొద్దున్నే వైరాగ్యం నింపేవి.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ఆర్డర్! ఆర్డర్! హియర్ మీ!

Also Read :

రాహుల్ కు తెలిసిన సావర్కర్

Also Read :

పెద్దవారి పిల్లలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్