Tuesday, September 24, 2024
HomeTrending Newsవిద్యారంగ పరిరక్షణకు మహా ఉద్యమం..ఏబీవీపీ

విద్యారంగ పరిరక్షణకు మహా ఉద్యమం..ఏబీవీపీ

రాష్ట్రంలో విద్యారంగ పరిరక్షణకు మహా ఉద్యమాన్ని నిర్మించాలని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యజ్ఞవాల్క శుక్ల అన్నారు. 41వ రాష్ట్ర మహాసభలు జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం పాఠశాల రామన్న గోపన్న ప్రాంగణంలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శంకర్, ప్రవీణ్ రెడ్డి లు ఏబీవీపీ పతాకాన్ని ఆవిష్కరించి సభలను ప్రారంభించారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యజ్ఞవాల్క శుక్ల, మను యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ పద్మభూషణ్ శ్రీయం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి యజ్ఞవాల్క శుక్ల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. విదేశీ సిద్ధాంతంతో ప్రభావితమై తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామనే బ్రమతో ఎంతోమంది విద్యార్థుల, యువకుల జీవితాలను నాశనం చేసిన నక్సలైట్లను ఈ గడ్డ నుండి తరిమివేసిన చరిత్ర తెలంగాణ యువతదని అన్నారు. జగిత్యాల ప్రాంతంలో జాతీయవాద సిద్ధాంతం కోసం ప్రాణాలర్పించిన రామన్న, గోపన్న, జితేందర్ అన్న, మధుసూదన్ గౌడ్ లాంటివారు పుట్టిన ఈ గడ్డ ఏబీవీపీకి పవిత్ర తీర్థ స్థలం లాంటిదని అన్నారు. ఇలాంటి ప్రాంతంలో ఏబీవీపీ రాష్ట్ర మహాసభలను నిర్వహించుకొవడం గర్వకారణమన్నారు. స్వాతంత్ర అనంతరం జాతీయ జెండా కోసం ప్రాణాలర్పించిన ఏకైక వ్యక్తి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు సామ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకమన్నారు. 50 లక్షలకు పైగా సభ్యులతో అన్ని యూనివర్సిటీల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంస్థ ఏబీవీపీ అని అన్నారు. ఏబీవీపీ ఉద్యమాల ఫలితంగా విద్యా రంగంలో, సామాజిక రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏబీవీపీ ఎన్నో ఉద్యమాలు చేసిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించబడతాయని, నిరుద్యోగం ఉండదని భావిస్తే అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన నియంతృత్వ పాలనతో రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడన్నారు. ఒక్క పోలీస్ ఉద్యోగాలు తప్ప ఏ ఉద్యోగ నియామకాన్ని కూడా చేపట్టలేదన్నారు. భారతీయ విలువలతో కూడిన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తే తెలంగాణ రాష్ట్రంలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో విద్యారంగ సమస్యల పరిష్కారం, ఉద్యోగ నియామకాలు, జాతీయ విద్యా విధానం అమలు కోసం రాష్ట్ర మహాసభల్లో ఉద్యమ కార్యచరణను రూపొందించాలని పిలుపునిచ్చారు.

పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీయం మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు సంస్కారాన్ని అలవర్చుకోవాలని, అతి పురాతనమైన భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని కోరారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ మహాసభల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి 1100 మంది విద్యార్థి నాయకులు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శంకర్, రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ, స్వాగత సమితి అధ్యక్షులు వాసం శివప్రసాద్, కార్యదర్శి మ్యాన మహేష్, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్