వెస్టిండీస్ తో జరుగుతోన్న రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా 419 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్ ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. అడిలైడ్ ఓవల్ మైదానంలో నిన్న మూడోరోజు రెండో ఇన్నింగ్స్ లో 38 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్ నేడు నాలుగోరోజు గంటన్నర లోపే మిగిలిన ఆరు వికెట్లూ సమర్పించుకుంది. ఆసీస్ బౌలర్ల దెబ్బకు ఐదురోజుల మ్యాచ్ నాలుగోరోజు తొలి సెషన్ కే ముగిసింది.
497 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 77 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నిన్న ఆసీస్ బౌలర్ బొలాండ్ ఒకే ఓవర్లో మూడు కీలక వికెట్లు తీసి టాపార్డర్ ను కుప్ప కూల్చిన సంగతి విదితమే. నేడు స్టార్క్, నాసర్, లియాన్ లు మిగిలిన వికెట్లు రాబట్టి ఘన విజయం అందించారు. విండీస్ జట్టులో చందర్ పాల్ చేసిన 17 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
బొలాండ్, స్టార్క్, నాసర్ తలా మూడు, లియాన్ ఒక వికెట్ పడగొట్టారు.
ట్రావిస్ హెడ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’, లబుషేన్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించాయి.