తయారీ రంగం మరింతగా విస్తరించాల్సిన అవసరం ఎంతో ఉందని, ప్రతిదానికీ చైనా పై ఆధారపడడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది కోవిడ్ సమయంలో అందరికీ తెలిసి వచ్చిందని రాష్ట్ర పారిశ్రామిక, ఐటి శాఖల మంత్రి కేటిఆర్ వ్యాఖ్యానించారు. జనాభా పరంగా, మానవ వనరుల పరంగా సమాన స్థాయిలో ఉన్న ఇండియా తయారీ రంగానికి హబ్ గా ఎదిగేందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయని, విదేశీ పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడులకు కావాల్సిన వాతావరణాన్ని మనం కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణా ప్రభుత్వంతో డైఫుకు సంస్థ ఎంఓయూ కార్యక్రమానికి కేటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియా యూనియన్ అఫ్ స్టేట్స్ గా ఉందని, ప్రతి రాష్ట్రం తనకు తానుగా ఓ విశిష్టతతో కొన్ని ప్రత్యేకతలతో కూడుకుని ఉంటుందని… ఈ స్థితిలో మనం పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎలాంటి విధానాలు అనుసరిస్తామనేదే ముఖ్యమని పేర్కొన్నారు.
తయారీ రంగంలో జపాన్ విధానాలు తనకు ఎంతో నచ్చుతాయని పేర్కొన్నారు. సుజుకి యజమానిని కలవడానికి వెళ్ళినప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని కేటిఆర్ వెల్లడించారు. సుజికి మ్యూజియాన్ని ఆరేడు ఏళ్ళ పిల్లలు కూడా సందర్శిస్తున్నారని.. అంటే చిన్నతనం నుంచే తయారీ రంగం, సరికొత్త విధానాలు, మోడళ్ళు, ఇన్నోవేషన్ లాంటి అంశాలను వారికి నేర్పించడం విశేషంగా ఆకట్టుకుందని వివరించారు. అందుకే మనం వినియోగిస్తున్న పరికరాల్లో ఎక్కువ శాతం జపాన్, కొరియా దేశాల నుంచి తయారైనవే ఉంటాయన్నారు. హిరోషిమా-నాగసాకీ విధ్వంసం, భూకంపాలు, సునామీలు, ప్రకృతి విపత్తులు ఎదుర్కొంటూ కూడా తయారీ రంగంలో ప్రపంచంలోనే అత్యున్నతస్థాయిలో ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. జపాన్ సంస్థ డైఫుకు 450 కోట్ల రూపాయల పెట్టుబడులతో 800 మందికి పైగా ఉపాధి కల్పించే దిశలో కంప్యూటర్ తయారీ రంగంలో ఓ బ్రాండ్ న్యూ ఫ్యాక్టరీ నెలకొల్పడం సంతోషంగా ఉందన్నారు కేటిఆర్.