బంగ్లాదేశ్ తో జరుగుతోన్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో రిషభ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 46 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత చతేశ్వర్ పుజారా, శ్రేయాస్ అయ్యర్ లు ఐదో వికెట్ కు 149 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ గాడిలో పెట్టారు. పుజారా 90 పరుగుల వద్ద ఔటై కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ 14 రన్స్ చేసి ఈరోజు ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
చట్టోగ్రామ్ లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియం లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 41 పరుగుల వద్ద శుభ్ మన్ గిల్ (20) ఔట్ కాగా, ఆ కాసేపటికే మరో ఓపెనర్ కెప్టెన్ కెఎల్ రాహుల్ (22) పెవిలియన్ చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి తైజుల్ ఇస్లామ్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు.
బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ మూడు, హసన్ మిరాజ్ రెండు, ఖలీద్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు.