Sunday, November 24, 2024
HomeTrending Newsఖతార్ ఫిఫా వినోదం... విషాద మరణాలు  

ఖతార్ ఫిఫా వినోదం… విషాద మరణాలు  

ఖతార్ లో మృతి చెందిన జగిత్యాల జిల్లాకు చెందిన వలస కార్మికుల కుటుంబాలతో ఆదివారం జిల్లా కేంద్రం జగిత్యాలలో శివసాయి ఫంక్షన్ హాల్ లో ఖతార్ ఫిఫా గల్ఫ్ అమరుల స్మారక సమావేశం జరిగింది. ఖతార్ జాతీయ దినోత్సవం మరియు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్బంగా…  ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్, సిఎస్ఆర్ ఫౌండేషన్, గల్ఫ్ జెఏసి, ఖతార్ మృతుల కుటుంబాలు కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించారు.

ఖతార్ లో మృతి చెందిన జగిత్యాల జిల్లాకు చెందిన 13 మంది కార్మికులు, ఏడు నెలలు ఖతార్ లో కోమాలో ఉండి ఇండియాకు  తరలించిన తర్వాత కొద్దిరోజులకే చనిపోయిన ఒక కార్మికుని ఫోటో సేకరించి వారి ఫొటోలతో ఒక  స్మారక బ్యానర్ ఏర్పాటు చేశారు. 14 మంది ఖతార్ గల్ఫ్ అమరులకు పూలతో  శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం, సమావేశంలో వారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు.

గల్ఫ్ కార్మిక నాయకులు మంద భీంరెడ్డి, గుగ్గిల్ల రవిగౌడ్, అబ్దుల్ సాజిద్, సయిండ్ల రాజిరెడ్డి, బండి వేణు, కల్లెడ వినయ్, శ్యామ్, వొల్లాల లింబాద్రి ఈ సమావేశంలో ప్రసంగించారు. గల్ఫ్ మృతుల కుటుంబాలు తమ బాధలను  చెప్పుకున్నారు. ఖతార్ దేశం ఫిఫా ప్రపంచ ఫుట్ బాల్ కప్ నిర్వహణకు ఎంపికైన 2010 నుండి గడిచిన పన్నెండు ఏళ్లలో ఫుట్‌బాల్ స్టేడియంలు, సంబంధిత నిర్మాణాలు, ఇతర పనులు చేసే కార్మికులు వివిధ కారణాలతో మృతి చెందారు. గత పన్నెండు ఏళ్లలో ఖతార్‌లో దాదాపు 100 మంది తెలంగాణ వలస కార్మికులు మరణించినట్లు ఒక అంచనా. మరణానికి కారణం ఏదయినా… ఖతార్‌లో తమ ప్రాణాలను త్యాగం చేసిన అందరు వలస కార్మికుల కుటుంబాలకు ‘ఫిఫా’ కమిటీ మరియు ఖతార్ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని వక్తలు కోరారు.

ఫిఫా పేరుతో కూలీలతో క్రీడేతర పనులు చేయించుకున్నారు.

ఫిఫా పేరుతో ఖతార్ లో క్రీడేతర మౌలిక వసతుల నిర్మాణం జరిగింది కాబట్టి మృతులు అందరికీ పరిహారం ఇవ్వాలి. వలస కూలీల చెమటతో, రక్తంతో  ఖతార్ పునర్నిర్మాణం అయ్యింది. ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన క్రీడగా ఫుట్ బాల్ పేరుపొందింది.

ఫిఫా పోటీల కోసం స్టేడియాలు, హోటళ్ల నిర్మాణం, రవాణా, టెలికమ్యూనికేషన్ సౌకర్యాల కల్పన, భద్రత కోసం ఖతార్ భారీగా డబ్బును వ్యయం చేసింది.
ప్రపంచ కప్  ఫుట్ బాల్ కోసం ఖతార్ వెచ్చించిన నిధుల్లో చాలా భాగం క్రీడేతర  మౌలిక వసతుల నిర్మాణానికి తోడ్పడ్డాయి. ఖతార్ జాతీయ విజన్-2030 లో భాగంగా మెట్రో రైల్వే, సరికొత్త నగరం, నూతన అంతర్జాతీయ విమానాశ్రయం, రేవు, వేల కిలోమీటర్ల కొత్త రహదారులు, 100 కు పైగా హోటళ్లు నిర్మించారు. టికెట్ అమ్మకాలు, అంతర్జాతీయ టెలివిజన్ ప్రసార హక్కులు, కార్పొరేట్ ప్రాయోజకుల ద్వారా లభించే 470 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఫిఫా తన జేబులో వేసుకుంటుంది. నిర్వహణ ఖర్చులు పోను ఫిఫా నికరంగా 300 కోట్ల డాలర్ల లాభం ఆర్జిస్తోంది.

2010 నుంచి ఈ స్టేడియాలు నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరనే ప్రశ్నకు జవాబు లేదు. ఫుట్ బాల్ పోటీల కోసం మౌలిక వసతులను నిర్మిస్తూ 2010-2020 మధ్య ఖతార్ లో 6,500 మంది వలస కూలీలు మరణించారని గార్డియన్ పత్రిక వెల్లడించింది. వారంతా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక కు చెందినవారే. దీనిపై మానవ హక్కుల సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఖతార్ ఫుట్ బాల్ క్రీడా వేడుకలు కార్మికుల బతుకులతో బంతాట ఆడుకున్నాయి. పరిహారం కోసం తాము చేసే న్యాయపోరాటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇవ్వాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్