Saturday, September 21, 2024
Homeస్పోర్ట్స్Savita Punia: ఆసియన్ గేమ్స్ పై దృష్టి పెడతాం: సవిత

Savita Punia: ఆసియన్ గేమ్స్ పై దృష్టి పెడతాం: సవిత

ఎఫ్ఐ హెచ్ ప్రొ-లీగ్ 2023-24  సీజన్ కు  అర్హత సంపాదించడం ఆనందంగా ఉందని భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ సవిత పునియా వెల్లడించింది.  స్పెయిన్ లోని వాలెన్సియాలో శనివారం జరిగిన ఎఫ్ఐహెచ్ విమెన్స్ నేషన్స్ కప్ -2022 ఫైనల్లో ఆతిథ్య స్పెయిన్ జట్టుపై ఇండియా 1-0తో విజయం సాధించి గోల్డ్ మెడల్ సంపాదించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో.. వచ్చే ఏడాది చివర్లో మొదలయ్యే ఉమెన్స్ ప్రొ-లీగ్ కు ఇండియా నేరుగా అర్హత సంపాదించింది.

2021-22  ప్రొ లీగ్ కు ఇండియా అర్హత సంపాదించలేకపోయింది. అయితే కోవిడ్ నేపథ్యంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తప్పుకోవడంతో ఇండియా, స్పెయిన్ జట్లకు టోర్నీలో ఎంట్రీ దక్కింది. అయితే ఆ లీగ్ లో ఇండియా అద్భుత ప్రదర్శన చూపి మూడో స్థానంలో నిలిచింది.  ప్రస్తుతం జరుగుతోన్న 2022-23  ప్రోలీగ్ కు ఇండియా జట్టు అర్హత సంపాదించలేక పోయింది.

ప్రొ లీగ్ టోర్నీలో అర్హత కోసం ఎఫ్ ఐ హెచ్ ఈ ఏడాది నుంచి విమెన్స్ హాకీ నేషన్స్ కప్ పేరిట సరికొత్త టోర్నమెంట్ ను నిర్వహిస్తోంది. ఆరంభ టోర్నీలో ఇండియా విజేతగా నిలవడం విశేషం.  పూల్ మ్యాచ్ ల్లో చిలీపై 3-1; జపాన్ పై 2-1; సౌతాఫ్రికా పై 2-0 తేడాతో విజయం సాధించిన ఇండియా సెమీ ఫైనల్ మ్యాచ్ లో పేనాల్టీ షూటౌట్ లో 2-1 తేడాతో గెలుపొంది ఫైనల్లో అడుగు పెట్టింది.

గత ఏడాది ప్రొ లీగ్ టోర్నీల్లో ఆడిన జట్టుగా ఆ ప్రాధ్యాన్యత ఏమిటో తెలుసని, అందుకే ఈ క్వాలిఫైంగ్ టోర్నీలో విజయం సాధించాల్సిన అవసరంపై ముందుగానే ఓ అంచనాకు వచ్చామని కెప్టెన్ సవిత  చెప్పింది. అందులోనూ ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లతో ఆడుతున్నప్పుడు మన ఆట తీరు ఎంత మేరుగుపడిందో తెలుసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. వచ్చే ఏడాది ప్రొ లీగ్ లో ఆడాలంటే ప్రతి మ్యాచ్ ఓ సవాల్ గానే తీసుకొని ఆడి గెలిచామని వివరించింది. 2023-24 ప్రొ లీగ్ కంటే ముందే సెప్టెంబర్ లో చైనాలో జరగబోయే ఆసియన్ గేమ్స్ లో కప్ గెలవడం తమ ముందున్న అతి పెద్ద ఛాలెంజ్ గా బావిస్తున్నట్లు తెలిపింది.

కాగా, నేషన్స్ కప్ సాధించి స్వదేశం చేరుకున్న మహిళా జట్టుకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్