శాంతియుత పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రగతి పథాన సాగుతున్నాం. అదే స్ఫూర్తితో భారత దేశ ప్రగతిని సాధిద్దాం.ఈ దశలో శాంతి, ప్రగతికాముకులైన ప్రతి ఒక్కరి సహకారం అవసరం” అని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి దూత ఏసుక్రీస్తు బోధనలు విశ్వ మానవ త్వానికి వసుదైక కుటుంబ స్థాపనకు దారులు వేస్తాయని సీఎం అన్నారు. క్రీస్తు బోధనలను తూచా తప్పకుండా పాటిస్తే కోపము ద్వేషము ఉండవని, ప్రతి మనిషి క్షమాగుణం తో జీవిస్తే ఈ నేలమీద యుద్ధాలే జరగవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
రాగద్వేషాలకు అతీతంగా మనిషి ఉన్నతమైన సంఘజీవిగా ఎదుగుతాడని సీఎం అన్నారు.
బుధవారం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..” జీసస్ క్రీస్తు కాంక్షించిన ప్రపంచం మహోన్నత మైనది, ఉదాత్తమైనది. క్రీస్తు అందించిన బాటలో పయనిస్తే, లక్ష్యాన్ని సాధించగలిగితే మనిషి దేవుడు అవుతాడు.” అని సీఎం ఆన్నారు.
ఈ సంధర్భంగా సీఎం కేసిఆర్ మాట్లాడుతూ…
” 20 ఏళ్ల క్రితం అశాంతితో, ఆత్మహత్యలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణను జై తెలంగాణ నినాదంతో శాంతియుత పద్ధతిలో సాధించుకున్నం. అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశం గర్వించదగ్గ స్థాయిలో నిలుపుకున్నం. అదే స్ఫూర్తితో నేడు జై భారత్ నినాదాన్ని తీసుకొని ముందుకు సాగుతున్నం. ఈ క్రమంలో ప్రగతికి తోడ్పాటు అందించే ప్రతి ఒక్కరి సహకారం కావాల్సి వుంది..” అని సీఎం అన్నారు. త్వరలోనే క్రైస్తవ మత పెద్దలతో రాష్ట్రస్థాయిలో జాతీయస్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.
ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, సీఎంవో అధికారులు..కార్డినల్ పూల ఆంథోనీ తో పాటు పలువురు క్రైస్తవ మత సంఘాల పెద్దలు, బిశప్పులు, ప్రభుత్వ మైనారిటీ శాఖ ఉన్నతాధికారులు.. తదితరులు పాల్గొన్నారు.
కాగా …
వేడుకల్లో పాల్గొనేందుకు బుదవారం సాయంత్రం ఎల్బి స్టేడియం చేరుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తొలుత అనాధ పిల్లల వద్దకు వెళ్లారు. వారికి క్రిస్టమస్ బహుమతులను అందించి వారిని ఆప్యాయంగా పలకరించి, వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వేదిక పైన ఏర్పాటుచేసిన క్రిస్మస్ ట్రీ ని వెలిగించారు. క్రిస్మస్ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రిస్టియన్ మత పెద్దలను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మత పెద్దలు కలిసి సీఎం కేసీఆర్ గారికి జ్ఞాపక ను బహూకరించారు. కార్యక్రమ ఆనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విందులో సీఎం కేసిఆర్ పాల్గొన్నారు.