రవితేజ లెక్క ఈ ఏడాది తప్పలేదు. తాను అనుకున్నట్టుగానే మూడు సినిమాలను బరిలోకి దింపాడు. ఈ ఏడాది ఆరంభంలో ‘ఖిలాడి’ .. మధ్యలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ .. నిన్న ‘ధమాకా’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. రవితేజ సినిమా ఏదైనా మొదటి నుంచి చివరి వరకూ మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళుతూ ఉంటుంది. కథలో సరిగ్గా పాళ్లు కుదరడాన్ని బట్టి అవి హిట్ అవుతూ ఉంటాయి .. లేదంటే అంతే ఫాస్టుగా థియేటర్ కి దూరమవుతూ ఉంటాయి.
ఇక దర్శకుడిగా నక్కిన త్రినాథరావుకి కి ఉన్న పేరు కూడా మాస్ వైపు నుంచే. అందుకువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ధమాకా’ నిన్న మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఇక కథలోకి వెళితే .. కొత్తదనం ఉన్నదేం కాదు. కథనంలో మాత్రం కావలసినంత వేగం ఉంది. ఆ స్పీడ్ కారణంగా తెరపైకి సీన్స్ చకచకా వచ్చి వెళుతూ ఆడియన్స్ కి బోర్ అనిపించకుండా చేస్తుంటాయి. అక్కడక్కడా కొన్ని సీన్స్ సిల్లీగా .. అవసరం లేనివిగా అనిపించినా రవితేజ తన మేజిక్ తో కవర్ చేసేశాడు.
ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన కథ కంటే స్క్రీన్ ప్లేకి .. మాటలకు ఎక్కువ మార్కులు ఇవ్వొచ్చు. ఇవన్నీ ఒక తక్కెట్లో వేస్తే, పాటలను మరో తక్కెట్లో వేయొచ్చు. రవితేజ సినిమాలో ఎలాంటి పాటలు ఉండాలో అలాంటి పాటలనే అందించడంలో సంగీత దర్శకుడిగా భీమ్స్ సక్సెస్ అయ్యాడు. కాకపోతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోనే అవసరం లేని చోట కూడా హైలైట్ చేయడానికి ట్రై చేశాడు. కార్తీక్ ఘట్టమనినేని కెమెరా పనితనం బాగుంది. పాటలను చాలా బ్యూటిఫుల్ గా తెరపై ఆవిష్కరించాడు. శ్రీలీల గ్లామర్ కి మంచి మార్కులే పడతాయి. ఇది పూర్తిగా రవితేజ మార్కు సినిమా .. ఆయన ఫ్యాన్స్ నచ్చుతుందనే చెప్పచ్చు.