నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా ‘కార్తికేయ 2′ తరువాత వచ్చిన సినిమానే ’18 పేజెస్’. ఈ సినిమాకి కథను అందించింది సుకుమార్. అందువలన ఈ సినిమా చాలామంది దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఇక గీతా ఆర్ట్స్ 2 నుంచి ఒక సినిమా వస్తుందంటే విషయం ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఆ వైపు నుంచి కూడా ఈ సినిమాపై బజ్ ఉంది. గతంలో సుకుమార్ – సూర్యప్రతాప్ కాంబోలో వచ్చిన ‘కుమారి 21 F’ సూపర్ హిట్ గా నిలిచింది. మళ్లీ ఇంతకాలానికి ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమానే ‘18 పేజెస్‘.
ఇలా ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ సినిమా, నిన్ననే థియేటర్లకు వచ్చింది. అందం .. ఆకర్షణ మాత్రమే కాదు, అనుభూతి పరిమళం కూడా రెండు మనసులను ఒకటిగా చేస్తుందని నిరూపించే కథ ఇది. ఈ సినిమాలో అనుపమ రాసుకున్న డైరీ నిఖిల్ కి దొరుకుతుంది. ఆ డైరీలో 18 పేజీలు చదివిన ఆయన, ఆమెకి మానసికంగా దగ్గరవుతాడు. ఆమె ఆలోచనలతో కాలం గడుపుతూ ఉంటాడు. 19వ పేజీ నుంచి ఆమె ఎందుకు డైరీ రాయలేకపోయిందో తెలుసుకోవడానికి హీరో చేసే ప్రయత్నంతో ఈ కథ మరో మలుపు తీసుకుంటుంది.
సాధారణంగా లవ్ స్టోరీ అనగానే పెద్దలను ఎదిరించడం .. తమ ప్రేమకి ఎదురులేదని నిరూపించడం .. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేయడం వంటివి కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. అందుకు ఈ సినిమా పూర్తిగా భిన్నం. ఎదుటి మనిషి ఎలా ఉంటారో తెలియకపోయినా, వారి డైరీ ద్వారా భావాలను .. అనుభూతులను ఆస్వాదిస్తూ ప్రేమలో పడటమే ఈ కథలో కొత్త పాయింట్. హీరో హీరోయిన్ ఇద్దరి మధ్య ఎలాంటి రొమాన్స్ నడవదు .. డ్యూయెట్లు ఉండవు. హీరో .. హీరోయిన్ తెరపై ప్రత్యక్షంగా కలవకపోయినా, ఇద్దరి మధ్య అనుభూతి అనేది ఆడియన్స్ ను ట్రావెల్ చేయిస్తూ ఉంటుంది. సున్నితమైన హృదయాలను సుతారంగా టచ్ చేసే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది. అందువలన లవ్ విషయంలో క్లాస్ సెన్స్ ఉన్నవారికి మాత్రమే ఈ సినిమా నచ్చే ఛాన్స్ ఉంది.