Taste- Name:
మాయాబజార్ భోజనంబు: హైదరాబాద్- విజయవాడ మధ్య తరచు తిరిగే నాకు సూర్యాపేట దగ్గర రోడ్డుపక్కన ఒక హోటల్ హోర్డింగ్ కనువిందు చేస్తూ ఉంటుంది. హోటల్ పేరు “మా రాజుగారి రుచులు”. దీనికి ముందో, వెనుకో రాజుగారి తోట, రాజుగారి రుచులు పేరిట హోటళ్లు ఉన్నాయి కాబట్టి దీనికి ముందు “మా” చేరింది. రుచి! శుచి!! అని ఎవరయినా చెబుతారు. మాయాబజార్లో విఖ్యాత నటుడు ఎస్ వి రంగారావు వివాహ భోజనంబు పాట ఫోటోను హోర్డింగ్ మొత్తం నింపిన ఐడియా ఎవరిదో కానీ…అద్భుతంగా ఉంది. ఘటోత్కచుడి ఆస్థాన ఉపాధ్యాయుడు చిన్నమయ, ఆయన శిష్య పరమాణువులు కిటికీ సందులో చూస్తుండగా గంగాళాలకు గంగాళాల పిండి వంటలు, కూరలు, పులుసులు, అన్నాలు, మిఠాయిలు ఖాళీ కావడం తెలుగు సినిమా దృశ్యాల్లో ఎవరెస్టు లాంటి సన్నివేశం. ఘటోత్కచుడు తినడానికి ముందు పెద్దగా ఉన్న చేతి పెద్ద గద…తిన్న తరువాత చేతి స్పూన్ అంత అయ్యేసరికి ఎస్ వి ఆర్ తృప్తిగా నవ్వుకుంటాడు. మనం కూడా అంతే తృప్తిగా అవన్నీ తిని జీర్ణం చేసుకున్నట్లు నవ్వుకుంటాం.
నిజానికి మాయాబజార్ కథ కల్పితం. మహాభారతంలో లేదు. రచయిత పింగళి మహేంద్రజాలంలో మాయాబజార్ ఒక అపురూప దృశ్య కావ్యం అయ్యింది. ఆ సినిమాలో ప్రతిదీ ఒక అద్భుతం.
అలాంటి అద్భుత మాయాబజార్ దృశ్యాన్ని హోటల్ హోర్డింగ్ కు వాడుకున్నవారిని అభినందించి తీరాలి.
వచ్చి తిని పో!
విజయవాడ ఆర్ టీ సి బస్ స్టాండ్ ఎదురుగా కృష్ణా గట్టు మీద ఒక ఈట్ స్ట్రీట్. రకరకాల తినుబండారాల స్టాళ్లు. అందులో ఒకదాని పేరు:- “వచ్చి తిని పో!”.
నాలుగేళ్లుగా చూస్తున్నా. కోవిడ్ దెబ్బకు మూతపడి…ఇక తెరుచుకున్నట్లు లేదు. బోర్డు మాత్రం చాలా కాలం పాటు అలాగే ఉంది.
అచ్చమయిన తెలుగు పేరు. అది కూడా రొటీన్ గా కాకుండా వైవిధ్యంగా ఉంది.
రా! వచ్చి…తిను…
తిని అలాగే ఉండిపోకుండా…తిరిగి వెళ్లు!
ఏంటలా చూస్తున్నావ్?
రా! తిను!!
ఇలా రకరకాలుగా ఆ బోర్డు పిలుస్తోంది.
నా పొట్ట! నా ఇష్టం!!
హైదరాబాద్ లో మరికొన్ని హోటల్ పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి.
“నా potta నా istam “
ఇంత మంచి తెలుగు మాటలతో పేరు పెట్టినవారు...రాసే లిపిలో అంత సంకరం ఎందుకు పాటించారో?
బహుశా అక్కడ వడ్డించే ఆహార పదార్థాలకు అది ప్రతీక ఏమో!
హైదరాబాద్ నాగోల్ ఆర్ టి ఏ ఆఫీస్ పక్కన ఒక హోటల్ పేరు “తిన్నంత తిను”. ఇంకెక్కడో మరో హోటల్ పేరు “కడుపు నిండా తిను”. హైదరాబాద్- విజయవాడ మధ్య ఒక హోటల్ పేరు “పల్లె రుచులు”.
చక్కటి ఈ తెలుగు పేర్లకు తగినట్లు ఆయా హోటళ్లలో రుచి, శుచి ఉందో లేదో నాకు తెలియదు.
కడుపుకు ఇంత అన్నం పెట్టే చోట తెలుగు పేర్లు పెడుతున్నందుకు సంతోషించాలి. మిడ్ వే, ఆఫ్ వే, క్వార్టర్ వే, సబ్ వే, అండర్ వే, అప్పర్ వే, హై వే, లో వే లాంటి పేర్లతో పోలిస్తే…ఏ రకంగా చూసినా... పల్లె రుచులు, కడుపు నిండా తిను, తిన్నంత తిను పేర్లు…తినకముందే కడుపు నిండే రుచికరమైన పేర్లు.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]
Also Read :
Also Read :
Also Read :