Monday, May 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంరెండు నెలలు బేఫికర్!

రెండు నెలలు బేఫికర్!

Coated Storage: కల్తీ ఆహరం రాబోయే రోజుల్లో మానవాళికి అతిపెద్ద ముప్పుగా పరిణమించనుంది. తీవ్రవాదం కంటే ఇదే మానవ మనుగడను, ఉనికిని ప్రశ్నార్ధకం చేయబోతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వరకూ తల్లి పాలు, కొబ్బరి నీళ్ళలో మాత్రమే కల్తీ ఉండదనే పేరుంది.  ఇప్పుడు కొబ్బరి బొండాల విషయంలో కల్తీ వచ్చేసింది. బొండాం సైజు పెరగడానికి, నీళ్ళు ఎక్కువగా రావడానికి కూడా రసాయనాలు వాడుతున్నారు.  కోడి బరువు,  కోడిగుడ్డు సైజు పెరగడానికి కూడా కృత్రిమ పద్ధతులు అనుసరిస్తున్నారు. మనం వాడుతున్న వంటనూనె, బియ్యం, గోధుమలు, పప్పు, ఉప్పు, కారం….ఇలా ప్రతి వస్తువూ కల్తీయే.  ఈ కల్తీ బెడద అరికట్టడానికి కొంతమంది సంపన్నులు సొంతంగా ఫార్మింగ్ ఏర్పాటు చేసుకోగా… కొన్ని సంస్థలు ఆర్గానిక్ ఉత్పత్తులు తయారీ మొదలు పెట్టాయి. వీటి విషయంలోనూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా, ధర కాస్త ఎక్కువైనా… ‘బెస్ట్ అఫ్ ద వరస్ట్’ చందంగా  వీటిని వినియోగించే వారి సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతోంది.

మనం తీసుకుంటున్న ఆహార పదార్ధాలు, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల రాబోయే కాలంలో కేన్సర్ బారిన పడేవారి సంఖ్య గణనీయంగా పెరగబోతోందని వస్తున్న నివేదికలు భయపెడుతున్నాయి. ఇదిలా ఉంచితే  జబ్బులు చేస్తే మనం వేసుకునే మందుల విషయంలో కూడా విస్తు గొలిపే రహస్యాలు ఉన్నాయి. మందులు వేసుకుంటే రోగం నయమయ్యే మాట అటుంచి కొత్త రోగాలకు బీజం పడుతోంది. మందు బిళ్ళలు (గొట్టాలు) తళ తళా మెరవడానికి కూడా రసాయనాలు వాడుతుంటారు. అదో పెద్ద సబ్జెక్ట్..  దాని లోతుల్లోకి వెళితే బైటకు రాలేం.

పళ్ళు, కూరగాయలు వారానికోసారి కొని వాటిని ఫ్రిజ్ లో  పెటుకొని వాడుతుంటాం. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలిసినా  ఈ ఉరుకులు-పరుగుల ప్రపంచంలో అది తప్పనిసరి అయింది. కరోనా సమయంలో అయితే మనింట్లో ఫ్రిజ్ లు పట్టక పక్కింట్లో కూడా దాచిపెట్టుకున్నాం.  దిగువ మధ్యతరగతి ఇళ్ళలో కూడా ఫ్రిజ్ ఓ నిత్యావసర వస్తువుగా మారింది. ఇప్పుడు మరో సరికొత్త పరిశోధన వెలుగులోకి వచ్చింది.

ఐఐటి గువహటి విద్యార్ధులు తాజా పరిశోధన ద్వారా ఆహార పదార్ధాలను ఎక్కువకాలం నిల్వ ఉంచేలా సరికొత్త రసాయనాన్ని తయారు చేశారు. దీనిద్వారా బంగాళా దుంపలు, మిర్చి, ఆపిల్, ఫైనాపిల్ లాంటి పళ్ళు కూరగాయలను రెండు నెలలపాటు నిల్వ ఉంచుకోవచ్చట. ఈ రసాయనాన్ని వాటిపై పూయాలి, తద్వారా  అవి రెండు నెలలు తాజాగా ఉన్నట్లు ఆ ప్రయోగంలో తేలింది. ఈ పదార్ధాలు వినియోగించడం ద్వారా ఎలాంటి ప్రమాదం లేదని వారు ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే ఈ విషయంలో అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి.

అసలు ఆయా పళ్ళు, కూరయాయలను పండించే సమయంలో వినియోగించిన కృత్రిమ పద్ధతుల సంగతేంటి? మనం వాటిని కొనే సమయానికే అవి సగం కల్తీ అయి వస్తున్నాయి, అలాంటప్పుడు వీటికి మరోసారి రసాయనం పూయడం వల్ల నిజంగా ప్రమాదం ఉండదా? వీరు కనిపెట్టిన ఈ రసాయనాన్ని కూడా భవిష్యత్తులో కల్తీ చేయబోరని గ్యారంటీ ఏమిటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.  ఈ ప్రశ్నలకు  కాలమే సమాధానం చెప్పాలి.

Also Read :

కొవ్వుతో పెరిగే కోపం

Also Read : 

ఆహారం – ఆరోగ్యం

Also Read : 

కాయగూరల్లో విషం

RELATED ARTICLES

Most Popular

న్యూస్