చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ పర్యటనలో భాగంగా కందుకూరులో జరిగిన రోడ్ షో లో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కొంతమంది కార్యకర్తలు గుండం కట్ట ఔట్ లెట్ లో పడిపోయారు. వీరిలో ఎనిమిది మంది మరణించారు. మరో పది మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
చనిపోయిన వారిని దేవినేని రవీంద్ర (ఆత్మకూరు), యటగిరి విజయ(ఉలవపాడు), కలవకూరి యానాది(కొండముడుసు పాలెం), కాకుమాను రాజా (కందుకూరు), మర్లపాటి చినకొండయ్య (అమ్మపాలెం), పురుషోత్తం (కందుకూరు) లుగా గుర్తించారు.
ఈ ఘటనతో బాబు తన కార్యక్రమాన్ని అర్ధంతరంగా నిలిపివేసి హుటాహుటిన ఆస్పత్రికి బాధితులను తరలించాలని పార్టీ నేతలను ఆదేశించారు. బాబు కూడా ఆస్పత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. అనంతరం వేదిక వద్దకు వచ్చారు.
ఈ ఘటన పట్ల చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధాకరమైన సంఘటన జరిగిందని, ఇది విచారకరమని, తన మీటింగ్ లో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన జరక్కుండా చూడాలని తన అభిమతమని… బాధితుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని, చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ పది లక్షల రూపాయలు పరిహారం పార్టీ పరంగా అందిస్తామని ప్రకటించారు. గాయపడిన వారిని కూడా పార్టీ ఆదుకుంటుందని, మృతుల కుటుంబాలకు రేపు అంత్యక్రియలు పార్టీ నేతలు దగ్గరుండి జరిపించాలని సూచించారు.