తెలంగాణలోని నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రానున్న కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర టెక్స్ టైల్ రంగానికి తగినన్ని నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ టెక్స్ టైల్ శాఖ మంత్రి కే.తారక రామారావు కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక వినూత్న కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టిందని, కానీ ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అందిన ప్రోత్సాహమేదీ లేదని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదేనన్న కేటీఆర్, వచ్చే ఏడాది కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే వీలు ఉంటుందన్నారు. అందుకే ఈ బడ్జెట్లోనే భారీగా నిధులు కేటాయించి నేతన్నలు, టెక్స్ టైల్ రంగం పట్ల తమ చిత్తశుద్ధిని మోడీ సర్కార్ నిరూపించుకోవాలని సూచించారు.
భారతదేశ టెక్స్ టైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందాలంటే భారీ ఎత్తున మౌలిక వసతున కల్పన చేయడం అత్యంత కీలకమైన అంశమని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ మేరకు దేశంలోనే అతిపెద్ద టెక్స్ టైల్ పార్కును కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ పేరుతో ఏర్పాటు చేస్తున్నదని కేటీఆర్ తెలిపారు. ఈ మెగా టెక్స్ టైల్ పార్కులో జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్ధలు సైతం పెట్టుబడి పెడుతున్నాయని, దేశీయ టెక్స్ టైల్ రంగంలో ఈ పార్కుకున్న ప్రాధన్యతను గుర్తించాలని కెటిఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ మెగా టెక్స్ టైల్ పార్క్ మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం నుంచి సహాయం కోసం అనేకసార్లు అభ్యర్థించిన ఇప్పటిదాకా ఒక్క రూపాయిని కూడా కేటాయించలేదని కేటీఆర్ గుర్తుచేశారు. సుమారు 1600 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ భారీ టెక్స్ టైల్ పార్క్ ఖర్చులో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. ఈసారి బడ్జెట్లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ మౌళిక వసతులు కల్పన, ఇతర కార్యక్రమాల కోసం కనీసం 900 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. పాలసీ ప్రోత్సాహకాలు లేకుంటే కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మేకిన్ ఇండియా ఒక నినాదంగా మాత్రమే మిగిలిపోతుందన్నారు. టెక్స్ టైల్ రంగంలోని అంతర్జాతీయ సంస్థలను మన దేశానికి రప్పించడంలో మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు.
రాష్ట్రంలో పవర్లూమ్ పరిశ్రమతో పాటు చేనేత పరిశ్రమకు కూడా తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత ఉందని తెలిపిన మంత్రి కేటీఆర్, రాష్ట్రంలో సుమారు 40వేల హ్యాండ్లూమ్ కార్మికులు పని చేస్తున్నారన్నారు. ఇందులో యాదగిరి భువనగిరి, గద్వాల్, వరంగల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థను మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. చేనేత కళ పైన డిప్లమా చేసేందుకు ఇక్కడి విద్యార్థులకు అవకాశం లేదని వీరంతా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వెళ్లి శిక్షణ పొందుతున్న నేపథ్యంలో తెలంగాణకి ఈ విద్యా సంస్థ మంజూరు చేస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉండడంతో పాటు ఇక్కడి చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడుతుందని కేటీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి గుండ్ల పోచంపల్లి మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలో అవసరమైన స్థలం అందుబాటులో ఉన్న విషయాన్ని కూడా మంత్రి కేటీఆర్ తెలిపారు.
బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడంతోపాటు గత ఏడు సంవత్సరాలుగా మోడీ ప్రుభుత్వం అమలుచేస్తున్న చేనేత, టెక్స్ టైల్ వ్యతిరేక విధానాలను పునర్ సమీక్షించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నేత కార్మికులకు రద్దు చేసిన పొదుపు పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
చేనేత ఉత్పత్తులపై ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు విషయంలో కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. చేనేతలపై పన్నును పూర్తిగా రద్దు చేయాలని, ఈమేరకు ఈ బడ్జెట్ లో పన్ను మినహాయింపును ప్రకటించాలని కోరారు. గ్రామీణ ఆధారిత ఉపాధి అవకాశాలు కల్పించే చేనేత రంగాన్ని, దేశ వారసత్వ చరిత్రను ప్రపంచ పటం పైన ఘనంగా ఆవిష్కరించే చేనేతను కేవలం ఒక పరిశ్రమగా కాకుండా దేశ సంస్కృతి సాంప్రదాయంగా చూడాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో గాంధీ మహాత్ముని ఆలోచనల మేరకు చేనేత రంగానికి పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. ఇప్పటికే MSME పై ఉన్న పన్నుల భారం వలన వాటి మనుగడ చాలా కష్టంగా మారిందని, ఈ విషయంలో కేంద్రం ఈ బడ్జెట్ లో ఉదారంగా వ్యవహరించాలని, పరిశ్రమ ప్రొత్సహాక చర్యలు ప్రకటించాలని కోరారు.