మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసే వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సమాజంలోని ఇతర మతస్థుల నమ్మకాలను దెబ్బతీసేలా, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడం, మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటం సహించరానిదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి మత విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారు ఎంతటి వారైనా తెలంగాణ ప్రభుత్వం వదిలిపెట్టదని, అలాంటి వారిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు ఉంటాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.