తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్న సభలో నేడు మరోసారి తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు. గత వారం కందుకూరులో బాబు రోడ్ షో లో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మృత్యువాత పడ్డ సంఘటన మరువక ముందే మళ్ళీ రెండో సారి ఈ తరహా ఘటన జరిగింది.
నూతన సంవత్సరం సందర్భంగా గుంటూరు వికాస్ నగర్ లో తెలుగుదేశం పార్టీ సభ జరిగింది. పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో, ఉయ్యూరు ఫౌండేషన్ సౌజన్యంతో చంద్రన్న కానుక పేరిట 30 వేల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని స్థానిక నేతలు భావించి దానికోసం టోకెన్లు కూడా పంపిణీ చేశారు. సభలో బాబు ప్రసంగించి వెళ్ళిపోయిన తరువాత చీరల కోసం మహిళలు ఒక్కసారిగా చీరలు ఉన్న వ్యాన్ల వద్ద ఎగబడడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ఒకరు మరణించగా, ఆస్పత్రిలో మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరణించిన ఇద్దరినీ రమాదేవి, ఆసియా గా గుర్తించారు.