గుంటూరులో తెలుగుదేశం పార్టీ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ముగ్గురు మహిళలు మరణించడం తనను కలచివేసిందని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందించాలని, గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
కాగా గుంటూరు జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, పలువురు నేతలు పరామర్శించారు. ఈ ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలని, ఆయన ప్రచార యావ, అధికార దాహంతోనే ఈ ఘటన జరిగిందని మంత్రి రజని ఆరోపించారు. మొన్న కందుకూరులో ఎనిమిది మంది మృతి చెందారని, మళ్ళీ ఈరోజు ముగ్గురు చనిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఫేక్ కానుకలు ఇస్తున్నట్లు ప్రచారం చేశారని, లారీల్లో జనాల్ని సభకు తరలించారని ఆమె విమర్శించారు. తన సభలకు జనం విపరీతంగా వస్తున్నట్లు చెప్పుకోవడానికి, ప్రచార ఆర్భాటం కోసం, కానుకల పేరుతో మభ్య పెట్టి ఇలాంటి ఘటనలకు బాబు కారణం అవుతున్నారని, ఇప్పటికైనా ఆయన కళ్ళు తెరవాలని డిమాండ్ చేశారు.