ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం ప్రతిపక్షాల హక్కు అని, దాన్ని కాలరాసే హక్కు ప్రభుత్వానికి లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రహదార్లపై రోడ్ షో లు, బహిరంగ సభలు నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవోపై విపక్షాలు స్పందించాయి. సిఎం అయినప్పటి నుంచీ జగన్ పరదాలు, బారికేడ్లు పెట్టుకొని సభలకు వెళుతున్నారని, ప్రతిపక్షంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను ఎత్తి చూపి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ హక్కు అని.. దీనిలో భాగమే రోడ్ షోలు, ర్యాలులు అని సోమిరెడ్డి వెల్లడించారు. చంద్రబాబు, లోకేష్ సభలకు వస్తున్నా స్పందన చూసి తట్టుకోలేకే ఇలాంటి జీవో తెచ్చిందని ఆరోపించారు.
ఈ జీవో తయారు చేసిన వారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 చదువుకోవాలని బిజెపి కి చెందిన రాజ్య సభ సభ్యుడు సిఎం రమేష్ సూచించారు. ప్రతిపక్షాలను ఎంత అణచివేయాలని చూస్తే అంతగా ప్రజలు తిరగబడతారని అన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, కనీసం వడ్డీలు కట్టే స్థాయిలో కూడా ప్రభుత్వం లేదని అందుకే ఇలాంటి జీవోలు తెస్తుందని విమర్శించారు.
సభలు నిర్వహించవద్దని ప్రభుత్వం చెప్పడం విడ్డూరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విస్మయం వ్యక్తం చేశారు. విపక్షాలు ర్యాలీలు, నిరసనలు చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ జీవో తెచ్చారని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సిఎం జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని.. కందుకూరు, గుంటూరు సంఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read : రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం