Sunday, November 24, 2024
HomeTrending Newsహిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న ఇరాన్ నటికి బెయిల్

హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న ఇరాన్ నటికి బెయిల్

హిజాబ్ కు వ్యతిరేకంగా ఇరాన్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నా ఆ దేశ నాయకత్వంలో మార్పు రావటం లేదు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా హిజాబ్ ధారణపై ఆంక్షలు అమలు చేస్తూనే ఉంది. తాజాగా ఇరాన్ చెస్ క్రీడాకారిణి సర ఖదీంకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నా పట్టించుకోవటం లేదు. కజాకిస్తాన్ రాజధాని అలమటిలో జరిగిన చెస్ చాంపియన్ షిప్ లో పాల్గొన్న 25 ఏళ్ళ సర ఖదీం హిజాబ్ ధరించలేదు. దీంతో హిజాబ్ ధరించకపోతే స్వదేశానికి రానవసరం లేదని ఆమెకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇరాన్ లోని ఆమె కుటుంబ సబ్యులకు కూడా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వీటిపై ఫిర్యాదులు చేసినా ఇరాన్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శలు వస్తున్నాయి.

మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఇరాన్‌ నటి తరనేహ్‌ అలిదస్తీ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయింది. మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉధృతంగా ఆదోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. గత డిసెంబర్‌లో నటి అలిదస్తీ కూడా ఆందోళల్లో పాల్గొన్నారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే 18 రోజుల తర్వాత ఆమెకు అధికారులు బెయిల్‌ మంజూరు చేశారు.

దీంతో సినీనటి జైలు నుంచి విడుదలైనట్లు ఆమె న్యాయవాది తెలిపారు. 2016 ఆస్కార్ గెలుపొందిన ‘ది సేల్స్‌మ్యాన్’ సినిమాలో అలిదస్తీ నటించారు. పలు టీవీ షోలలో కూడా కనిపించారు. గతంలో ఇరాన్‌ సినీ పరిశ్రమలో జరిగిన మీటూ ఉద్యమంలో అలిదస్తీ పాల్గొన్నారు. ఆమెను జైలు నుంచి విడుదల చేయాలని ప్రపంచ వ్యాప్తంగా 600 మంది నటీనటులు బహిరంగ లేఖపై సంతకాలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్