Saturday, November 23, 2024
HomeTrending Newsమరో మార్గంలేకే సుప్రీంకు..... సీఎస్ లేఖ

మరో మార్గంలేకే సుప్రీంకు….. సీఎస్ లేఖ

కృష్ణా జలాల్లో ఏపీ నీటి వాటాను కోల్పోయేలా తెలంగాణ వ్యవహరిస్తోందని.. సాగునీటి అవసరాలతో సంబంధం లేకుండా, జలవిద్యుత్తు ఉత్పత్తి కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు సుప్రీంకోర్టు తలుపు తట్టడం తప్ప తమకు ప్రత్యామ్నాయ మార్గం లేదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పని చేయడం లేదని, ఇది వారి న్యాయబద్ధమైన విధులు నిర్వహించేలా మరింత తోడ్పడుతుందని తెలిపింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు  లేఖ రాశారు. మంగళవారం రాత్రి ఈ లేఖను పంపారు.

‘తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై ఉమ్మడి జలాశయాల్లో నీటి వినియోగంపై ఉన్న విధివిధానాలను ఉల్లంఘిస్తూ జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తోందని మా ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ 2014 విభజన చట్టం సహా అన్నింటినీ ఉల్లంఘిస్తోందని మరోసారి మీకు తెలియజేస్తున్నాం. తెలంగాణ శ్రీశైలంలో నీటిమట్టాలు నిలబడకుండా విద్యుదుత్పత్తి చేసేస్తోంది. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ గ్రావిటీ ద్వారా నీరు పొందేందుకు శ్రీశైలంలో ఉండాల్సిన +854 అడుగుల నీటిమట్టాన్ని నిలబెట్టడమే కష్టమవుతోంది. ఫలితంగా తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీటిని అందించలేం. తెలంగాణ కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండా సాగర్‌, పులిచింతల నుంచి ఏకపక్షంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది. ఏపీకి ఉన్న కేటాయింపుల ప్రకారం నీటిని ఇవ్వకుండా ఉండేందుకు, నీటి విడుదల ఆలస్యం చేసే వ్యూహంలో భాగంగానే తెలంగాణ ఇలా వ్యవహరిస్తోందనిపిస్తోంది. నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయేలా చేస్తోంది’ అని లేఖలో పేర్కొన్నారు.

బోర్డు పరిధిని త్వరగా తేల్చండి
‘బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ప్రాజెక్టులవారీ కేటాయింపులు జరిపే వరకు కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయొద్దంటూ తెలంగాణ ఏడేళ్లుగా అడ్డుపడుతోంది. అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. బోర్డు పరిధిని త్వరగా నోటిఫై చేయాలని, ఉమ్మడి జలాశయాల నుంచి నీటిని తీసుకునే ఆఫ్‌టేక్‌ పాయింట్లు దాని పరిధిలోకి తీసుకొచ్చి సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నాం. విద్యుదుత్పత్తి నిలిపివేసేలా కేంద్రం కృష్ణా బోర్డు ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం. బోర్డు ఆదేశాలను కూడా తెలంగాణ లెక్క చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టులోనే న్యాయం కోరాలని నిర్ణయించుకున్నాం’ అని లేఖలో వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్