సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీరసింహారెడ్డి సినిమా జనవరి 12న వస్తుంటే.. వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13న విడుదల అవుతుంది. అయితే.. ఈ రెండు సినిమాలతో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన వారసుడు సినిమా కూడా రిలీజ్ అవుతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. దిల్ రాజు తనకున్న థియేటర్లో భారీగా విజయ్ వారసుడు సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. దీంతో చిరు, బాలయ్య చిత్రాలకే ఎక్కువ థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది.
దీంతో దిల్ రాజు పై ఒత్తిడి పెరిగింది. అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు దిల్ రాజు పై ఫైర్ అయ్యారు. అలాగే నిర్మాత సి.కళ్యాణ్ ఇటీవల బహిరంగంగానే తెలుగు హీరోలు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు కాకుండా తమిళ హీరో సినిమాకు థియేటర్లు ఇవ్వడం కరెక్ట్ కాదంటూ దిల్ రాజు పై మండిపడ్డారు. ఇలా అన్ని వైపుల నుంచి దిల్ రాజు పై విమర్శలు వస్తుండడంతో వారసుడు చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు దిల్ రాజు. తమిళ్ లో జనవరి 11న వరిసు రిలీజ్ అవుతుంది. తెలుగులో మాత్రం జనవరి 14న వారసుడు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని.. చిరంజీవి, బాలకృష్ణ గార్ల చిత్రాలకు తన వలన వన్ పర్సెంట్ కూడా డ్యామేజ్ జరగకూడదనే తన సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా దిల్ రాజు ప్రకటించారు.
Also Read : వారసుడు గా విజయ్ డిఫరెంట్ గా ట్రై చేసినట్టుందే!