కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ లో రాణించడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఇండియా 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 373 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్య సాధనలో లంక 8 వికెట్లు కోల్పోయి306 పరుగులు చేయగలిగింది.
గువహటి బర్సప్ప క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు రోహిత్- గిల్ 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గట్టి పునాదులు వేశారు. గిల్-70 (60 బంతుల్లో 11 ఫోర్లు) చేసి ఔట్ కాగా, రోహిత్-83 ( 67 బంతుల్లో 9 ఫోర్లు, 3సిక్సర్లు) రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ మరోసారి తన సత్తా చాటి 87 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్ తో 113 పరుగులు చేసి 49వ ఓవర్లో ఔటయ్యాడు. కెఎల్ రాహుల్-39, శ్రేయాస్ అయ్యర్-28 పరుగులు చేశారు. లంక బౌలర్లలో రజిత 3; మధుశనక, కరుణరత్నే, శనక, ధనుంజయ డిసిల్వా తలా ఒక వికెట్ సాధించారు.
భారీ లక్ష్య సాధనలో తడబడిన లంక 19 పరుగులకే మొదటి వికెట్ (ఫెర్నాండో-5) కోల్పోయింది. మరో ఓపెనర్ పాతుమ్ నిశాంక 72; ధనుంజయ డిసిల్వా-47 పరుగులు చేశాడు. కెప్టెన్ శనక 88 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 108 పరుగులు చేసి అజయంగా నిలిచాడు, శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేయగలిగింది.
ఇండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3; సిరాజ్ 2; షమీ, హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చాహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
కోహ్లీకి ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.