రంజీ ట్రోఫీలో ముంబై బ్యాట్స్ మ్యాన్ పృథ్వీ షా రికార్డు నెలకొల్పాడు, రంజీ చరిత్రలో రెండో హయ్యస్ట్ స్కోరు సాధించాడు. ఈ సీజన్ టోర్నమెంట్ లో భాగంగా అసోం-ముంబై జట్ల మధ్య గువహతి లోని అమింగ్ యాన్ స్టేడియంలో నిన్న మ్యాచ్ మొదలైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసిన ముంబై నేడు 4 వికెట్లకు687 వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. నిన్న తొలిరోజే డబుల్ సెంచరీ పూర్తి చేసి 240 పరుగులతో నాటౌట్ గా నిలిచిన పృథ్వీ 379 పరుగుల వద్ద రియాన్ పరాగ్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. 383 బంతులు ఎదుర్కొని 49 ఫోర్లు, 4 సిక్సర్లతో ఈ పరుగులు సాధించాడు. ముంబై కెప్టెన్ అజింక్యా రేహానే 191 పరుగులు చేసి త్రుటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. రెహానే అవుట్ కాగానే ముంబై ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
379 పరుగులు చేయడం సంతోషం కలిగించినా 400 మార్కు చేరితే బాగుండేదని పృథ్వీ షా వ్యాఖ్యానించాడు.
1948-49 సీజన్ లో మహారాష్ట్ర ఆటగాడు బిబి నింబాల్కర్ 443 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇదే రంజీ ట్రోఫీ చరిత్రలో హయ్యస్ట్ స్కోరు.. క్వాడ్రపుల్ (400) చేసిన ఏకైక ఆటగాడిగా కూడా కొనసాగుతున్నారు. పృథ్వీ షా 21 పరుగుల తేడాతో ఈ మైలురాయిని మిస్ చేసుకున్నాడు.