ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుండి అస్సాంలోని దిబ్రుఘడ్ వరకు గంగా విలాస్ పేరుతో ప్రయాణం సాగించనున్న ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యాటక నౌకను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కొద్ది సేపటి క్రితం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ లోని కాశీ క్షేత్రం వారణాసి నుంచి బంగ్లాదేశ్ మీదుగా అసోంలోని డిబ్రూగఢ్ వరకు 3,200 కిలోమీటర్ల పాటు సుదీర్ఘంగా ఈ రివర్ క్రూయిజ్ పయనించనుంది. ఈ విలాసవంతమైన నౌకా ప్రయాణం 50 రోజుల పాటు 27 నదుల గుండా సాగనుంది. ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో సహా 50 పర్యాటక ప్రదేశాలను ఈ క్రూయిజ్ షిప్ టూర్ ద్వారా సందర్శించే అవకాశం కల్పిస్తోంది. దాంతో పాటు అదనంగా సుందర్బన్స్ డెల్టా, కజిరంగా నేషనల్ పార్క్‌తో సహా జాతీయ పార్కులు, అభయారణ్యాల గుండా కూడా ఈ షిప్ పయనం సాగనుంది.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్, కేంద్ర పోర్టులు, నౌకా, జల రవాణా శాఖల మంత్రి శర్బానంద్ సోనోవాల్, తదితరులు వారణాసి లో ప్రత్యక్షంగా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.