కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది, వారి ఆదాయం గణనీయంగా పడిపోయిందని, రైతుల పెట్టుబడి పెరిగిపోయిందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య-ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు. వ్యవసాయంలో మార్పులు తెస్తామని చెప్పి నల్ల చట్టాలు తీసుకు వచ్చి కార్పొరేటీకరణ చేసిందని, తద్వారా జరిగిన ఆందోళనల్లో 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న పాపం వారిదేనన్నారు.
ఈనెల 19న ఖమ్మంలో జరగనున్న బిఆర్ఎస్ సభ జాతీయ రాజకీయాలను మలుపు తిప్పబోతోందని, జాతీయ స్థాయి నాయకులు చాలామంది ఈ సభకు వస్తున్నారని, నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యేలా చూడాలని నేతలకు హరీష్ రావు సూచించారు. సిఎం కేసిఆర్ తలపెట్టిన సభ సందర్భంగా పాలేరు నియోజకవర్గ సన్నాహక సమావేశం కూసుమంచిలో జరిగింది. మంత్రి హరీష్ తో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఇలాంటి సభ గతంలో ఎప్పుడూ జరగలేదని, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా హాజరవుతున్నారని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలందరూ చిత్తశుద్దితో పనిచేసి విజయవంతం చేయాలని… పాలేరు నుంచి కనీసం 50 వేల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని హరీష్ రావుపిలుపు ఇచ్చారు. దేశంలో ఎక్కడా చూసినా తెలంగాణ మోడల్ పథకాలు అనే మాట వినబడుతోందని, చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా మన రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టిందని వెల్లడించారు.